పుట:Bhaarata arthashaastramu (1958).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇది యసంగత ప్రలాపమని యూహింపబోకుడు. మనలోని యాచారము లనేకములు కష్టకాలమున నుద్భవించినవనియు, ఋషిప్రోక్తములుగావనియు నార్థికదశలచే దీర్పబడినవనియు, నట్లగుట గాలదేశానుగుణముగ వీనిని మార్చుటలో దప్పులేకుండుటయకాదు, సర్వవిధముల నొప్పనియు దాత్పర్యము. ధర్మార్థములకుండు నన్యోన్య సంబంధము వివాహములందుబలె నితర ప్రతీతుల యందంత విశదంబుగాదు.

ఇంగ్లాండులో పురుషులకన్న స్త్రీల నెక్కువగ జూతురు. దుర్ఘటములు క్లేశసహితములునైన క్రియలు వారిభాగమునకు రావు. పత్నీశుశ్రూషయే పరమధర్మంబు. మనలో పతివ్రత మనునది యెట్లో వారలలో సతీవ్రత మనునది యట్లు. కావున భార్య లెక్కువయైన భర్తకు భారమెక్కువయగుట సిద్ధము. మఱియు సేవకుల కనేకత్వము చెల్లునుగాని నాయకులకు చెల్లదు. స్త్రీలు నాయికలు యజమానురాండ్రు కావున సపత్నీదోషమున్న సంసారము బహురాజకమగును. బహురాజక మరాజకమునకన్న నతిదుష్టము. కావున నింగ్లాండులో నేకపత్నీవ్రతము చిరస్థాయియయ్యె.

గ్రామ్యపద్ధతి నుద్ధరించు కారణములు

ఈ దేశమున స్త్రీల దాసత్వము, గ్రామపద్ధతియు నన్యోన్య శరణ్యములు గావున నివి యధాక్రమముగ నేకకాలమున నస్తమించుం గాని యొకటిపోయి యొకటి యొంటిగ నిలువనేరదు. గ్రామ్య వ్యవహారము కడుబాలిశమనువారు నారీజనులస్థితి నుత్కృష్టముగ నొనర్ప నుద్యుక్తులుగావలయు. స్త్రీ దాసత్వమీ యార్ధికస్థితికి ప్రధమపాదము.

తక్కినవి యెవ్వియన :-

2. రాకపోకలులేమి:- ఇది వాణిజ్యవ్యాప్తికి ప్రతిఘాతకరము. వాణిజ్యములేనిది సర్వమును దమకుదామ సన్నాహ పఱుపవలయును.