పుట:Bhaarata arthashaastramu (1958).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొడంగిరి. ఇయ్యవి సర్వసాధారణములైనందున ధర్మంబులని చెప్పబడియె. విధియేమున్నది! అందఱు జేయువానిని అధర్మములన్న భ్రష్టులెవరు? భ్రష్టులం జేయువారెవరు? పూర్వము ధర్మము నాలుగు పాదములతో నడిచెననుట కిదేయేమో యర్థము! అనగా నెట్టిపాపకార్యములుగూడ ధర్మకార్యములని యాదరింపబడిన నిక నధర్మ మెక్కడనుండివచ్చును? చూడుడు! మను బ్రహ్మగారి స్మృతిలో నెన్నివిధముల పుత్రులు పేర్కొనబడియున్నారో!

ఔరసుడు :- భార్యయందు భర్తకుబుట్టినవాడు. ఇదిసరియే.
క్షేత్రజుడు :- చనిపోయినవానియు, బిడ్డలులేనివానియు భార్యయందు నియుక్తప్రకార మింకొకనిచే బుట్టింప బడినవాడు.
దత్తుడు :- ఇదియు సరియే. ఇందేమియుదోషముగానరాదు.
గూఢోత్పన్నుడు :- భర్తకు దెలియకయే భార్య యతనికి బరుని వలన బ్రసాదింపించిన పుత్రుడు!
కానీనుడు :- పెండ్లి కాకమునుపే కన్యచే గన్నకుమారుడు!!
సహోఢుడు :- పెండ్లి యపుడే గర్భముతోనున్న స్త్రీకి జనించిన వాడు!!!

ఇట్లి యనాచారము లనేకములు సదాచారములుగ బూర్వం పాటింప బడినవి. వివాహములు నట్లే బలాత్కారముగ నిష్టములేని వనితను జెఱగొనిపోయి చెఱచిన నదియు నొకవివాహమనుట! ఇక వివాహము కాని దెద్దియో నిరూపింప బ్రహ్మకైన నలవికాదు. కృతయుగరీతి యిట్లుండిన ధర్మదేవతకు కుంటితన మెట్లు సంభవించును? ఎంత లోతులోబడినను గాళ్ళు విఱుగవుగాన ధర్మము విధిలేక నాలుగు పాదములతో వర్తింపవలసినదాయెను! అందఱు గ్రుడ్డివారుగానుండిన రంభలుగాని రమణులుందురె? అంధకారమున నందఱును సుందరులే!