పుట:Bhaarata arthashaastramu (1958).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాడుపఱచి తమసహజబుద్ధి కౌశల్యమును వెల్లడిసేయుట యచట గనులార జూడవచ్చును. గ్రామరక్షణకార్య మింతటితో ముగిసెనా పొగాకును వక్కాకును ముద్దగాజేర్చి పెట్టికొనుటచే నుబికిన కపోల ఫలకంబుగలిగి, ఠీవిగా దుడుముదట్టుచు రాత్రులలో దోటివాడొకడు పారాతిరుగును. ఈ యొయ్యారములన్నియు నరాజకము వలన గలిగినవని వేఱ యెత్తిచెప్పనేల?

రక్షణవిషయమున నెట్లు గ్రామస్థులకు రాజ్యముమాని నిలువక ప్రత్యేకముగ గ్రమముల నేర్పఱచుకొను నవస్థయాయెనో, యట్లే యార్థికవిషయములందును. మంచిబాటలు , నమ్మకముతో వర్తించు భటులు, పక్షపాతములేని న్యాయాధికారులు, నిరంతరకలహప్రియులు గాక ప్రజలబీడింపని రాజులునులేని దేశములో వాణిజ్యము లుండవు కాన, ప్రతిగ్రామమునను సామగ్రులన్నిటిని దామే యుత్పత్తి చేసికొనవలసిన వ్యవస్థ తటస్థించె. కావుననే పల్లెలలో మంగలి, చాకలి, కమ్మరి, వడ్రంగి, కంసాలి, కుమ్మరి, మేదరి మొదలగు వారలు నివసించియుండుటయు, వీరిలో ననేకులకు గ్రామస్థులు మొత్తముగా నందఱుగలిసి యేటేటకు నింతింతయని మాన్యములు నిచ్చుటయు సంభవించినది. కలహముల దీర్చుటకు పంచాయతీదారులు, పూజాపునస్కారములకు మంత్రములు తెలిసి తెలియని పురోహితుడు, లెక్కలను వక్కలుముక్కలుగా వ్రాయుటకు కరణము, తానెన్ని తప్పుల జేయుచున్నను ఇతరులయొద్ద ధర్మమును భద్రముగ నిలుపుటకు రెడ్డియొకడు - ఇట్లు వీరిచే గ్రామములు రాజ్యములట్లు సర్వాంగ బంధురములై పరస్పర భిన్నములై బయటివారితో గలయికలేనివై యేర్పడినవి.

మఱియు రాజ్యములట్లు గ్రామములు నొండొంటిపై గాలు ద్రవ్వి కాట్లాడుటయు గలదు. ఒకయూర 'కలరాదేవి' విడిసిన