పుట:Bhaarata arthashaastramu (1958).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్రునియింటవదలిన వానికి శూద్రబుద్ధియే అబ్బునుగాని బ్రాహ్మణ్య మలవడదు. శూద్రునైన బ్రాహ్మణ గృహంబునంబెంచి పెద్దవానింజేసిన వాడు శుద్ధోచ్చారణతో సంధ్యావందనముం జేయగలడు. మనదేశము నేలిన రాజులలో తక్కువలెక్కకు ముక్కాలుమంది జాతిచే శూద్రులయ్యు క్షత్రియపదవి నధిష్ఠించినవారై యజ్ఞోపవీత ధారణాది క్రియలచే ద్విజులుగ గణింపబడి ద్విజకుల కారకులైయుండుట సుప్రసిద్ధము. చెన్నపురి రాజధానిలో బ్రాహ్మణులనబడువారు ఆదిని అనార్యులైన ద్రావిడులనియు ఈనాడును బ్రాహ్మణత్వ సిద్ధినొందినవారనియు వారిముఖశిర:పరీక్షణమున మనుష్య శాస్త్రవేత్తలు స్థాపించి యున్నవారు. కావున జన్మమునకన్న కర్మమే యుత్తమ బలవంతమనుట విశదము.

కర్మతత్త్వ విచారణ

కర్మమనుపదము తెలిసియో తెలియకయో ప్రయోగించితిమి. అపద మందఱును వాడునదిగాన దానియర్థము నిట విమర్శించి సోష్టీకరించుట వదలగూడని కార్యము. మఱియు నది యీ చర్చతో సంబంధించిన విషయమే.

మనవారు "పూర్వోపాత్త కర్మహతిచే నీదుస్థితికి వచ్చితిమి" అని వాడుకగా బలికెదరు. ఎవరికర్మము చేత నెవరు క్రిందబడిరనుట వివరముగ విచారింతము.

సాధారణమైన యర్థమేమనగా:- "నేను మున్ను పాపము జేసితిని. దానిఫలమే యిపుడు బీదనై వందురుట." సరే. అయిన నొక్కటి. ఈజన్మము పూర్వజన్మముచే నిర్ధారితము. అయ్యది తత్పూర్వజన్మస్థాపితము. ఇట్లే నిర్ణాయకముల నిరూపించుచు వెనుకకు బోవంబోవ నాదిజన్మ మెద్దానిచేతను నిర్ణయింపబడనిదగును. ఏలయన దానికి నాద్యజన్మ మెద్దానిచేతను నిర్ణయింపబడని దగును. ఏలయన దానికి నాద్యమెయ్యదియునుండదు. కావున కర్మముచే బీడింపబడని జన్మమొకటి యుండుననుట నిర్వివాదాంశము.