పుట:Bhaarata arthashaastramu (1958).pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బులును పెచ్చుపెఱిగి ఏకదేశీయభావమునకుం బ్రత్యూహములై జనులను శక్తిహీనులంజేసి యలయించినవి. వాణిజ్యార్థము వచ్చిన ఐరోపావారినిజూచి యశుద్ధులని తెగడి దూరంబుగ వెళ్ళుటయు వారి యాచారములలో నొకటిగానుండెను.

ఆసమయమున అమెరికాదేశస్తులు తమవారికైన తిరస్కారమునకు బ్రతీకారము జేయబూని, జపానువారిని శిక్షింప యుద్ధపు నావలం బంపిరి. అవి రేవునవిడిసి ఫిరంగుల బేల్చగనె జపానీయులు తమకిక నోటమి తప్పదని యెఱింగినవారై నయము మెఱయ సమాధానము జేసికొని "ఇక ముందైన మానభంగము రాకుండవలయునన్న దేశమును వృద్ధిపఱుచుటయే యుపాయంబుగాని వేఱొండులేదు; శాంతప్రవర్తనలచే శత్రువులు శాంతింపరు" అని చక్కగా నెఱింగినవారై యానాటగోలె నోటిమాటల బ్రసంగించుట లేకున్నను, అభ్యుదయక్రియల ననుష్ఠానములోనికి దెచ్చుటకు రోమరోమంబుల నుండిపుట్టి ప్రజ్వరిల్లు పౌరుషంబుతో ప్రారంభించిరి. ముప్పదియైదు సంవత్సరములలో సంఘసంస్కారముం బూర్తిగావించి, క్షత్రియ బ్రాహ్మాణాదులకును తక్కుంగలవారికిని బొత్తుగల్పించి, జాతిభేదములు మూఢజనాదరణీయములని నిరసించి, ప్రాచీనవేదములు ప్రకృత కాలమునకుజాలవని నవీన కళావిషయక శాస్త్రములనేర్పు పాఠశాలలం బ్రతిష్ఠించి, యావిద్యలం బ్రసరింపజేసి, ఐకమత్యము గలవారౌట నవక్రవిక్రమాఢ్యులై, సేవలను యుద్ధంపునావలను ఆధునికరీతి సర్వసన్నాహ సమేతములం గావించి, ముప్పదియైదేడులలోన చీనాదేశపు జక్రవర్తినోడించి విజృంభించిరి. అదిచూచి రష్యా, జర్మనీ, ఫ్రాన్‌స్ దేశములవారు అసూయాగ్రస్తులై జపానువా రాక్రమించు కొనిన భూములను, చీనావారికే ప్రతిదానమిచ్చునట్లు నిర్భంధించిరి. వారినెదిరించినిలుచు శక్తిలేనివారగుట జపానువారు తలలువంచి యప్పటి కంగీకారముసూపి పగదీర్ప నదను వేచియుండిరి.