పుట:Bhaarata arthashaastramu (1958).pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈకలికాలములో రణక్రీడ కృతయుగాదులయందుంబలె సెలవు లేక చేయబడు వినోదముగాదు. భారతాది యుద్ధములలో వీరుల కెప్పుడోగాని ఆకలిదప్పులు గలుగుట వినబడదు. అప్పటివారు కృశోదరులు; ఈనాటివారు వృశోదరులు. ఆకాలమున భీమసేనుడొకడు మాత్రమెట్లో ఈకాలమువారి జాతికిజేరినవాడు! మనకు మంత్రతంత్రములు ఇంద్రజాలములును సుముఖములుగావు. యుద్ధభూమిలో నుండియేతీరవలయు; దెబ్బలే తినవలయు! ప్రాచీనులదెబ్బ వేరు. వా రస్త్రబలముగలవారు. ఒకడు తన యింటిపెఱటిలోనే మఱ్ఱి యూడతో బండ్లుదోముకొనుచు గ్రహచార వశమున నావేళకు శాత్రవుడెవడైన జ్ఞప్తికివచ్చెనన్న కోపోద్దీపితుడై, ఆ యూడ కటుక్కని విఱుగునట్లు పండ్లు పెటపెటగొఱికి బ్రహ్మాస్త్రముం బ్రయోగించిన ఆయస్త్రము సూర్యకోటి సదృక్షప్రకాశ దుర్నిరీక్షమై ప్రళయకాల జాజ్వల్యమాన కీలికీలాకలాపంబు నిరసించు ప్రక్రియ రేగి, త్రోవనెదురుపడినవారి మీసములనైన గమలజేయక నేరుగ ఆశ్రాతవునేకదిసి, వాడొకవేళ నప్పుడు నిదురించుచుండిన, సంహరించుట ధర్మవిరుద్ధంబు గావున, వాడు లేచి సన్నద్ధుండగువఱకు వాకిటగాచియుండి నోటీసిచ్చి పిమ్మట వానిపై బడుటయో లేక వాడికింకనుం బ్రచండుడై పాశుపతాస్త్రంబుం దీటుకొల్పిన తోక ముడిచికొని యింటికి మఱలివచ్చి యజమానునకు సర్వముం దన పౌరుషంబు నివేదించి తూణీరగతంబై తూగుటయో యొక్కటి యాచరించి విరమించుట గతయుగ గౌరవంబు! ఆబేడలు ఈ కలియుగపు నీటిలో నుడుకవు.

ప్రధమగణ్య బలంబులగు రాష్ట్రంబులు దాకెనేని కురుపాండవ సంగరంబట్లు 18 దివసంబులంగాక 18 నెలలను సమాప్తినొందుట సందేహంబు. వత్సరమునకు సుమారు అధమపక్షము 100 కోటుల రూపాయలైనలేకున్న సైన్యం నాయితపాటుతోనుంచుట దుర్లభము.