పుట:Bhaarata arthashaastramu (1958).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కకాని మగతనము దెలుపుట కుంచుకొననివారమైతిమో నాడే ఈశిఖండులచేనిండిన దేశములోనుండ రాదని అర్థలక్ష్మియొక్కతెయే కాదు, ఆమె నెడబాయకుండు సర్వలక్ష్ములును అంతర్థానమొందినవి. పురుషకార ప్రకాశితులగుటచేత పాశ్చాత్యులు సర్వవిధములైన యభ్యుదయములకు బాత్రులైరనుట యుక్తము. ఊరక వారిని లోభులనుట పాపము. ధనమునుమాత్రము మూటలగట్టి ఇంకేగొప్పతనము లేనివారైయున్నచో నొకవేళ నట్లనినను జెల్లునుగాని ప్రత్యక్షముగ శాస్త్రసంచయములనెల్ల శోధించి వికసింపజేసిన మహాత్ములను శుద్ధ లోభులనుట చెల్లదు. అదియటుండనిండు.

యంత్రకళలచే దేశమునకు మొత్తముమీద మేలుగలిగినను జీతమునకు బనిజేయు జనసామాన్యమునకు వీనివలన ఎగ్గా లగ్గా, యనుట విచార్యము.

యంత్రకళలచే జీతగాండ్రకు తటస్థించు సుఖదు:ఖములు

1. యంత్రోద్భవముల వెలలు సాధారణముగ దఱుగుచు వచ్చును. అదెట్లనిన, యంత్రవ్యవహార మధికవృద్ధి ననుసరించును. కృషివలె హీనవృద్ధి పీడితముగాదు. కావున సరకులు హెచ్చుకొలది వెలలు లొచ్చగును. అట్లౌట ఒకవేళ కూలితగ్గినను ఆ తగ్గినకూలికే మునుపటియంతయో ఇంకను ఎక్కువయో సామానులు గొనవచ్చును గనుక మొత్తముమీద లాభమే.

పైవాదమునకు ఆక్షేపణములు:- ఈలాభము నెప్పుడు వడయ జాలుదురు? తాము వినియోగించు వస్తువులు యంత్రకృతములైన యెడలగదా! ధనికులు వాడెడి జరతారుశాలువలు, లోహపాత్రములు మున్నగునవి యంత్రములచేజేయబడి, బీదలుపయోగించు మట్టి పాత్రలు మోటుగుడ్డలును పూర్వమువలె హస్తనిర్మితములేయైన యంత్రీయముల వెలలుతగ్గిన ధనికులకేగాని తక్కువవారు కేమిమేలు?