పుట:Bhaarata arthashaastramu (1958).pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొఱకు పనివానిని వెదకికొనిపోక, యట్టిభాగము నింకొక్కటిదెప్పించి వేసికొనవచ్చును. బైసికలులు (అనగా కాలితో ద్రొక్కంబడు రెండుచక్రముల రబ్బరు బండ్లు) చేతిగడియారములు వీనిలో నొక చక్రమో ముల్లో చెడిపోయిన ఇంకొక చక్రమో ముల్లో రప్పించి యథాప్రకారము నడుచునట్లు చేసికొనుట బహుసులభము. హస్త కళలలో నింత నిష్కృష్టముగా పరిమాణములు గుదుర్చుటకు గాదు గాన, మనయిండ్లలో నగలు క్రిందబడి కీళ్ళు, మరలు, మొక్క బోయిన సాధారణముగ నానగను జేసినవాడేగాని ఇతరు డద్దాని నలవరింపజాలడు.

అమెరికాలో కాపువారు అందఱు నొకచోట నిండ్లుగట్టుకొని సముదాయముగా వసియించుటలేదు. తమతమ పొలములలో గృహము లేర్పఱిచి వసింతురు. ఆపొలములు నూఱులకొలది నెకరాల విస్తీర్ణములు గలవిగాన వారు ఒంటరిగాండ్రరీతినుండుట పద్ధతిగానున్నను వ్యవసాయమునకువలయు యంత్రముల తఱుచుగా వాడెదరు. సమీపమున మతమ్మత్తు షాపులులేకపోయినను యంత్రముల నుంచుకొనుటకు పైని వివరింపబడిన నిష్కృష్టపరిమాణలక్షణమే అనుకూలకారణము.

8. మఱియు చేతిపనివాండ్రు తమ వృత్తిలో నష్టమైన వేఱొక వృత్తిలో తటాలున బ్రవేశించుట సాధ్యముగాదు. వడ్రంగి యెంతో తరిబీతులేనిది కమ్మరికానేరడు. చాకలి మంగలియౌటయు, మంగలి చాకలియౌటయు వరప్రసాదమున్నంగాని ఈడేరదు. కావున నష్టమున్నను కుడితిలోని బల్లిమాదిరి నందేనిలిచి శ్రమపడుటయో తుదకు వ్యాపారరహితుడై యేమియు జేయుటకులేక తిరిపెమునకు దిరుగుటయో వారినొసల లిఖింపబడిన వ్రాత.

యంత్రకళలలో వృత్తులుమార్చుట యంత దుస్తరముగాదు. ఏలన సర్వయంత్రములకును గొన్నిగుణములు పోకలుసామాన్యములు. వీని నెఱింగినవాడు ఒకశాలవిడిచి ఇంకొకశాలకు బోయినను అతి