పుట:Bhaarata arthashaastramu (1958).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దించుగదా ! అందును నీగ్రంథము ముఖ్యముగా నింగ్లీషురానివారి కొఱకు వ్రాయబడినది. నోటికి నందని చెవికి దాకని పేరులం బ్రయోగించి వారిని భయపఱచుటకు నాకిష్టములేదు. ఇంగ్లీషు తెలియనివారికిని లఘువుగ గ్రాహ్యమగునట్లు నాచే నైనంతచేసితి. ఇంకను దుర్గమములగు ప్రదేశములున్న నికముందు తరుణమబ్బెనేని వానిని చదరముసేయుటకు విధేయుడనై యున్నాడను.

ఈ పుస్తకములోని పటములు గణితశాస్త్రానుసారముగ దీర్ప బడినవికావు. శాస్త్రసమ్మతములు సామాన్యజన వేద్యములు గాకుండునను శంకంజేసియు, నాయొక్క రచితములు అశాస్త్రీయములైనను విషయవైశద్యమునకు ననుకూలములని నాకుం దోచినందునను, వాని నిట బొందింప నుత్సహింతినేకాని, సాహసము సర్వవిధముల మంచిదనికాదు.

ఈ కృతిని రచింపవలయునను ఉద్దేశమాత్ర మున్నకాలములో మనుస్మృతి, కామందకి, చాణక్యార్ధశాస్త్రము, విజ్ఞానేశ్వరీయము మున్నగు గ్రంథముల జదివితిగాని వానివలన నాకుగలిగిన లాభ మత్యల్పము. అయినను భాషావైదశ్యమును పరిభాషాసూచక సందర్భములును లభించకపోలేదు గాన వానికై వినియోగింపబడిన శ్రమ మొత్తముమీద సార్థకమే.

మన ధర్మశాస్త్రములలో ధర్మ మెంత సున్నయో యర్థశాస్త్రములలో నర్థతత్త్వ విచారణ యంత సున్నయనిన పాపమెవరికిని రాబోదు ! అయిన నర్థతత్త్వ విచారణ లేకున్నను, పూర్వకాలమున హిందూదేశమున ప్రబలియుండిన వర్తకములు, శిల్పములు, వ్యావహారిక శాసనములు, రాజులు ప్రజలనోరుగొట్టి ద్రవ్యముల దోచుకొను పద్ధతులు, వీనిం గూర్చిన యుపన్యాసము లెన్నియోకలవు. గాన నవి మనవారు తప్పక చదువదగినవి. ఇకముందు ప్రచురింపబడు సంపుటములలో నీసంగతు లనేకములు వొందింతునని తోచెడిని.