పుట:Bhaarata arthashaastramu (1958).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వశక్తి సమేతులమైయున్న మనమందఱము సర్వజ్ఞులైన భగవంతుల మైయేయుందుము. అప్పుడు సామాన్యజ్ఞానము, సర్వజ్ఞానము అను భేదమే లేకపోవును. కాబట్టి మనుష్య శాస్త్రములు మనసౌలభ్యమునకై స్వరూపమున ప్రత్యేకితములుగాని స్వభావముచే ప్రత్యేకితములు గావనుట గ్రాహ్యంబు. వస్తుభేదములేదు. మూర్తిభేదమును మాత్రము కల్పించుకొంటిమి.

ఈ యైక్యమును శక్తికొలది బ్రకటించియున్నాను. సమగ్రముగ బ్రకటింపలేదనుట నేనెయెఱుంగుదు. ఈ చిల్లర బల్లర బేరము మాకెందున కందురేమో ! ఏమో ఈ విషయములో నిదివఱకు బ్రవేశము లేనివారికది కొంతమాత్రమైన నబ్బెనేని, ఇకముందు వ్రాయు శాస్త్రకారులు దీని నాధారముగాగొని రెండువిధముల మనకు మేలుసేతురను నాస గొనియున్నాడ. ఏమన ఒకటి ఈశాస్త్రములయొక్క సమన్వయము నిఖిల నిదర్శన వ్యాఖ్యానములతోజూపి అప్రతిహతముగ బ్రకటించుట. రెండవది ఎట్లును సామాన్యాంశముల గొంతవఱకును మన చదువరు లెఱిగియున్నారని యీ విషయము పొంతబోక ఐరోపాలోని సిద్ధాంతులట్లు తమతమ ప్రత్యేకశాస్త్రముల యందే శ్రద్ధగొని సమగ్రకృషిచేయుట. మద్విరచితంబగు నీశాస్త్రంబు మనకు నూతనముగాన తదితర శాస్త్రంబులతోడి పొత్తుగలపకున్న నర్థము తేటతెల్లంబుగాదు. ఇయ్యది యిమ్మహాతత్త్వ మండలిలో బాలబోధవంటిదిగాని ప్రౌడగ్రంధంబుగాదు.

ఈ శాస్త్రమును సంఘాదిశాస్త్ర సంబంధిగా విమర్శించుటలో మార్గదర్శకులును గురుప్రాయులు నైనవారు "జాన్ స్టూవర్టు మిల్లు" అను కీర్తిశేషులైన మహనీయ విద్వాంసులు. ఇంత చాలును. ఇక నేను జదివిన గ్రంథముల తత్కర్తల నామముల నన్నింటినిట పొందింప నేల ? అవియొక యర్ధముగాని యుపనిషత్తులుగా మనవారి చెవులలో