పుట:Bhaarata arthashaastramu (1958).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ గ్రంథ మెన్ని సంపుటములలో నెన్నడు ముగియనున్నదో యీశ్వరునికే యెఱుక ! విషయ మెన్నివిధముల బెఱుగునో యన్నివిధముల దుదదాకు వఱకును విచారమును బోనిచ్చుట నామతము. కావున నేనెంత వ్రాయుదునో యేమివ్రాయుదునో ముందుగా దెల్పుమన్న మూగవేసము దాల్పవలసినదే. ఇట్లగుట మీయొక్క క్షమాపణ మిక్కిలి విథేయతమై నాశించువాడ. వేడువాడ. నమ్మి నిరీక్షించువాడ.

ఈ గ్రంథరచనకు నన్నుం బ్రేరేపించుతయకాదు నిర్బంధముం గూడ జేసినవారగుట విజ్ఞానచంద్రికామండలీ కార్యనిర్వాహకులు నాకు నెంతయు మాననీయులు.

         ఉ. శ్రీమ దనంత కృష్ణులు, విశేషగుణాఢ్యులు, సంస్కృతాంధ్ర భా
            షామహనీయ విద్యల విశారద భావులు నాకు దోడు గా
            బ్రేమయు గారవంబుమెయి పెక్కువిధంబుల నిల్చి సేయ నే
            నోమితి గాక లేని యెడ నోర్వగ నేర్తునె కార్య భారమున్.

విజ్ఞానచంద్రికా మండలివారి ప్రోత్సాహముచే నీ గ్రంధము జననమంది దీర్ఘాయురారోగ్యములం గోరి ఆంధ్రమహాజనుల కరుణ సుధారసదృష్టి నాశ్రయించుచున్నది.

ఇట్లు
విధేయుడు,
కట్టమంచి - రామలింగారెడ్డి.

శ్రీ మహారాజుగారి కాలేజి. మైసూరు.

1913 వ సం. జనవరి