పుట:Bhaarata arthashaastramu (1958).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నింకొకయిల్లు పిశాచిబట్టిన వడువున లీనమైయుండుట అసంభవము. కావుననే లోకులందఱు నేకసద్మనివాసులుగాక ప్రక్కప్రక్కల గేహముల నిర్మించుకొని యుండవలసినవారైరి. అనుకూలమగు చోటుననే అన్నియిండ్లును ఉండనేరని కతంబునగాదె స్థలసంబంధియగు తారతమ్య మావిర్భవించి బాడుగలలో వ్యత్యాసము గల్పించె? కావున వ్యాప్తికృతంబైన స్వామిభోగంబు శ్రమ ప్రతిఫలంబుగాదు. మఱి ప్రకృతిచే సృష్టితమైన భూప్రదేశమును గ్రహించుటవలన గలిగినది.

భూమికింగల యుత్కర్షము అందలి ద్రవ్యవిశేషమాత్రంబునం గాదు. మఱి వ్యాప్తిచేతనువచ్చినది. జాతోద్యోగులమై అనంతశ్రమలకోర్చి సారవిస్తరమును చేకూర్పజాలితిమేనియు వైశాల్యవిస్తరము మనుజశక్తికిమించిన గుణంబుగాన ప్రజాసంఖ్య వృద్ధిజెందుకొలది చోటుచాలక అన్యోన్యకలహముల కాస్పదమగును వ్యాప్తి స్థిమితము. ఒకరి కెక్కువయైన నితరులకు మిగిలినది తక్కువకు వచ్చుంగావున మహీపతిత్వంబు ప్రాణతుల్యంబునువలసిన ప్రాణపరిత్యాగార్హంబునునై వఱలుచున్నది. వ్యాప్తియు మూలార్థములట్లు వృద్ధిపఱుపగూడునదియై యున్నయెడల నింత ఘనతకు బాత్రమైయుండదు.

కళానైపుణి, వాణిజ్యకౌశల్యము ఇత్యాది బృహదర్థ ప్రతిపాదక విద్యలు పరిపణంబులా? ఇవి పుంజీకృతములట్లు అనేక కాలము ఒక్కనియందే నిలుచునవియేగాక పారంపర్యముగ వ్యాపించి శతాబ్దముల పర్యంతము సజీవములై పెంపెక్కుటయుంగలదు ఇవి సిరులకు నెలవులు. అభ్యుదయాస్పదంబులు. కాబట్టి వీనిని నీవి (మూలధనము) అన్నదోషంబులేదు. కాని ఎవ్వరి భోగంబునకై సంపద లుపార్జితంబులగునో వారిని (అనగా మనుష్యులను) మూలధనముగా బరిగణించుట సరికాదు. అర్థము భోగ్యము. నరుడు భోగి. భోగిభోగ్యమ్ములకు సమత్వం బసిద్ధంబు.