పుట:Bhaarata arthashaastramu (1958).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాణిజ్యము లున్నట్టుండి ప్రాతదారినివదలి క్రొత్తదారికి రావనుట నాలుగు. ఈకారణములచే చిరకాలమునష్టముగలిగె. ప్రజలు ఉత్కంఠ గొన్నవారగుటచే దమభాగముల నితరుల కమ్మజూచిరి. కొనువారు మాత్ర మెవరుగలరు? కావున తాల్మిలేక మిగుల హింసజెందిరి. ఇయ్యది ఆర్థికోత్పాతములలో నొక్కటిగ నెన్నబడునంత యుపద్రవ కారియయ్యె. కావున ఫలము శీఘ్రముగ రావలెనను తలంపు గొనుటవలన కాచి కనిపెట్టుక యుండుటకు సామర్థ్యము లేనివారు అచలములలో నంతగా బ్రవేశింప బూనరాదు.

భూమినేమాత్రము మూలధన మననగును

భూమి నిసర్గజంబంటిమి. నిజమేకాని క్షేత్రములు ప్రకృతి దత్తములా? కంటకపాషాణ దుర్గమంబై, వన్యసత్త్వ భయంకరంబై, జలాధారరహితమైన యీ పృధ్విని సమంబుగ జేసియు, మృగంబుల వధించియు, చెఱువులద్రవ్వియు, కాలువలేర్పఱచియు, నింతటి స్థితికిం దెచ్చినవారు మనుష్యులేకదా! అట్లౌట నది ఆదిని స్వభావసిద్ధంబయ్యు ఇప్పటికి మనుష్యకృతంబాయెనని చెప్పవలదా? కావున పొలములును కొంతవఱకు పరిపణంబులే.

అయినను వ్యాప్తి (దిగంతరము, విస్తారము, వైశాల్యము) పౌరుషేయంబుగాదు. వట్టి విస్తారములో నేమియున్నదని చులకగ జూతురేమో యని తగదు. మహాపట్టణములో వైశాల్యము స్వల్పమగుట చేతనేకదా గృహములన్నియు వెడల్పుగగట్ట ననువులేక పొడవుగబోసాగి లెక్కలేని యంతస్తులతో మేడలు నిర్మింపబడిన వాయె! అమెరికాలో 'న్యూయార్క్‌' అను పట్టణములో 45 అంతస్తుల మేడలున్నవి. నేను కనులారజూచి యాశ్చర్యమగ్నుడనైతిని. మఱియు నేకస్థలమున ననేక గృహములుగట్టుట తరముగాని తలంపు. అనగా శరీరములో నాత్మ యావేశించియుండునట్లు ఒకయింటిలో