పుట:Bhaarata arthashaastramu (1958).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును క్షేమముగనున్న జాలును" అని యెంచు నీచాత్ము లనుకొను వాక్యము. ఇంతేకాదు. ఇట్లుచెప్పుట తమమేలునే యథార్థముగ నెఱుంగమియుం బ్రకటించుచున్నది. ఎట్లన:- వీరు కాలోపహతులైనను సంఘము స్థిరముగా నుండును. సంఘ మడుగంటిన వీరొంటిగా నిలుచుటకగునా? నిలిచి యేమిచేయ గలుగుదురు?

కావున నేను నొక్కి వకాణించున దేమన్నను, పౌరుషము గౌరవముగలది. తుచ్ఛమైనదిగాదు. ఏవిషయముయొక్క యాధార్థ్య మెఱుగగోరినను భిన్నపాత్రముల పరముగ విచారించుట సంపూర్ణ తత్త్వ బోధకంబుగాదు. అక్షరములు పదములచేతను, పదములు వాక్యములచేతను, వాక్యములు గ్రంథములచేతను అర్థవంతంబులు గాను గణనీయంబులుగానునౌను. అట్లు నరుండును సంఘముంజెందిన జరితార్థుడౌనుగాని, తనంతట గనిగొనిన నిరర్థకుడును, నిష్ప్రయోజనుడును, నశ్వరుడుగాను దోచును. సంఘము, జాతి, దేశము, రాష్ట్రము, లోకము అను సమూహములకు మనము అంగంబులును అంగములలో నణగియుండు నణువులను బోలినవారము. సంఘీభావము లేనివారమగుటచే నిమ్మహాతత్త్వంబు నెఱుగక వెఱ్ఱివేదాంతములను ఉరులం దవిలి యలజడింగొంటిమి. ఇకనైన మనకు బుద్ధివచ్చునా? యాథార్థ్యము విచారింప గడంగుదుమా? ఈ యురులలోనుండి విమోచనము గలుగునా? చూడవలయు.

శ్రమ యర్థముల సమకూర్చు విధంబులు

ఇక శ్రమ అర్థప్రాప్తి నేయే విధంబుల సమకూర్చుననుట వివరింతము.

1. పరిగ్రహణక్రియలచే ప్రకృతిలోనుండి ఉరువిడి నుప్పతిల్లం జేయుట. ఉదా. ధాన్యలోహమీనమాంసాది పరిగ్రహణము.

2. రూపభేదంబుల గల్పించుట-వడ్లు ప్రత్తియు నట్లే యుపయోగమునకురావు. మఱి అన్నవస్త్రాదిరూపంగ మార్పుజెందవలయు.