పుట:Bhaarata arthashaastramu (1958).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని పురుషకారంబునకు నాయకత్వంబును దైవంబునకు భటత్వము గల్పించి ప్రతికూలకాలములలో మనస్తాప శమనార్థము దైవమునకు గర్తృత్వము గట్టవలయు ననిరిగాని కాలము, కర్మము ఇత్యాదులకు భూభారధౌ రేయతం బట్టము గట్టలేదు.

మనప్రాణము శాశ్వతము గానంతనే లోకమంతయు మిథ్యయనుట యెంత అహంభావమును సూచించుచున్నదో యోచింపుడు! రెండవది. ఉండు జీవమును సార్థకము జేయజాలనివారలకు చిరంజీవిత్వ మేలకావలయునో తెల్పుదురా? కార్య కౌశలమున సిద్ధ సంకల్పులట్లుండియు బాశ్చాత్యులు కాకులరీతి జిరజీవిత్వ మపేక్షింపరుగా? ఇది ఆలోచింప సోమరిపోతులకేకదా కాలము చాలదనుట ప్రస్ఫుటంబయ్యెడు. ఒక్కవేళ దేవుడు ప్రత్యక్షమై మీ రమర్త్యు లౌదురని వరంబొసఁగెఁబో అపుడైన వీర లుద్యోగయుక్తులౌదురా! బహుశ: కారు. "ఎట్లును చావులేని బ్రతుకు గడించితిమిగదా! ఇంకేల కష్టపడవలయు? ఏమిచేయకున్నను చావేమోలేదు. పాటుపడుటెల్ల ప్రాణములు నిలుపుకొఱకు. అవి యెట్లున్నను నిలుచును గాన హాయిగా నిద్రబోవుద" మని కుంభకర్ణదీక్ష నవలంబింతు రేమో!

తొలుత గవర్నమెంటువారు కలరా మశూచి మొదలగు రోగములకు వ్యాఘాతముగా క్రియలు వాడుకకు దెప్పించినపుడు "అబ్బా! ఇవి తగిలినవారుగూడ బ్రతుకగలరా" యని హేళనము జేసిరి. ఫలాని ఫలానివారు చావరు అని అభయమిచ్చుటకు బ్రిటిష్‌వారు మంత్రవాదులుంగారు; ఋషులుంగారు. వారి యుపదేశముచేత మొత్తముమీద అనగా సరాసరికి మునుపటికన్న నెక్కువమంది పోవుచున్నారా, తక్కువమంది పోవుచున్నారా యని విమర్శించి ప్రశ్నింప వలయుగాని తన పుత్రుడో పెండ్లమో పరలోకగతు లైనందున చికిత్సలన్నియు హుళుక్కియనుట తెలివితక్కువమాట యౌటమాత్రమేకాదు. "సంఘ మెట్లున్ననేమి మేము మాకుటుంబ