పుట:Bhaarata arthashaastramu (1958).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. స్థానభేదము గల్పించుట - కాశిలోని పట్టుచీరలు మద్రాసులోని సుందరీమణులు ధరించి వాహ్యాళి వెడలవలయునన్న తొలుత నాచీర లింతదవ్వు తేబడనిది వారి కుపయోగ్యములుగావు. ఎచ్చట భోగ్యములో అచ్చటికి సరకులందెచ్చుట ఆనయంబు నాబడు.

4. రక్షక సంఘటనము. సంచితవిత్తముల భద్రముజేయుటకు ఇండ్లు ఇనుపపెట్టెలును వలయుగదా! లేనిచో మనకు దక్కవు.

5. ఉపకరణ నిర్మాణము - ఉలి, ఱంపము, మడకలు, యంత్రమలు ఈలాంటి సాధనములులేక చేతులతోమాత్రము పనిచేసిన ఎక్కువ గడింపజాలము.

6. వినిమయము - అనగా క్రయవిక్రయములు. వీనిచే నెవ్వని కేమాత్ర మేవస్తువుగావలయునో యది నిర్ణయింపబడుగాన నిదియు సార్థకశ్రమయే.

7. విచారణ - అనగా పనివారు పాటుపడుచున్నారా లేదా యని గమనించుట.

8. యంత్రసృష్టి వాణిజ్యవిస్తరము - ఇత్యాదులకు నాద్యంబగు మంత్రశక్తి. అనగా ఆలోచనాసామర్థ్యము. బుద్ధిబలము దేహబలంబునకుం దోడ్పడినగాని కార్యము జరుగుట యఱిది.

ఇట్లు పురుషకారంబు నానావిధంబుల నర్థప్రాప్తికి సాధనం బగును.

ప్రత్యక్ష పరోక్ష ఫలంబులు

నేరుగా అనుభవమునకు దెచ్చికొనుటకై పడెడుపాటు ప్రత్యక్ష ఫలదాయి. ఉదా. పండ్లుగోసితినుట. మధువుగ్రోలుట. ఈ జాతికిజేరిన యుద్యోగము లంతగాలేవు. ధాన్యమాంసంబులు సైతము వండబడినం గాని నాగరికులకు దినుటకుంగావు. కావున వ్యాపారములన్నియు దఱుచు పరోక్షఫలదాయకములని తెలియునది.