పుట:Bhaarata arthashaastramu (1958).pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధర్మములకును ప్రత్యేక ప్రాణిలక్షణ ధర్మములకునుగల వ్యత్యాసము గనిపెట్టి పృధక్పాత్రలకన్న సంఘమే ముఖ్యమని గ్రహించి తన్మూలముగ సత్యాస్త్య (సత్తు అసత్తు అను) విచారణలు జరుపుట యన నెక్కడనుండి వచ్చును? ఇదియే హిందూయూరోపియనుల తత్త్వములకుగల ముఖ్యాంతరము. ఇంగ్లీషువారు జగత్తు సత్యమనియు దినదిన ప్రవర్ధమానమనియు సుఖదాయియనియు సంఘలక్షణములంబట్టి నిరూపింతురు. మనము మనయింటగల్గు నొకటిరెండు జననమరణాదులం జూచి "సంసారము దు:ఖసాగరము. నిధ్య, గర్హ్యము" అని వాపోవుదుము. ప్రతివాడును దుర్బలుడైనను సంఘ మేకీభావము దాల్చెనేని యనిరుద్ధమగుననుట తెలియనివారమౌటను, దేశముయొక్క యుష్ణప్రకృతిచే శోషితసత్త్వులమగుటను; గ్రీకులు మహమ్మదీయులు చీనావారు మొదలగువారు దండెత్తి యథేచ్ఛముగ గొల్లలాడి కష్టించి ఆర్జించినవాని దోచుకొని మనకష్టమును వృధచేయుటం బట్టియు, అశక్తులకును సహజమగు తనివి జెందవలయునను నాశచే "దైవకర్మములే అన్నిటికిని గర్త" లనియు, "బురుష కారంబు నిష్ప్రయోజనం" బనియు, "శుభాశుభంబు లాత్మతంత్రంబులుగా" వనియు బూతు సంకేతములు గల్పించుకొని అపజయమునకన్న ననర్థములగు తృప్తిని సోమరితనమును దాల్చితిమి. పౌరుషము సాగనందున గల్పించుకొనబడిన తత్వములుగాని ఇవి, వీనిచే బౌరుష హీనులమైతిమనుట బొంకు. అపజయముచే ఉత్సాహహీనతయు, నందుచే నన్నియు నుడిగి మూలజేరి తప్పించుకొందమనుబుద్ధియు, శమదమాది నిరతియు బొడమును. ఇపుడైననేమి, జయము లబ్బునేని రాజసత్వంబుదాల్చి ప్రతాపమూర్తులము కాగలము. మనవారు బల గరిష్ఠులుగానున్న కాలంబున

        మ. "విను ముద్యోగము రెంటియందు బర ముర్వీనాథ: యుద్యోగ వం
             తునకుం దైవము తోడ్పడంగ ఫలసిద్ధుల్ చేకుఱున్ మానసం
             బున నొక్కొక్కెడ సిద్ధిదప్పిన వగల్ వొందంగ రానీక య
             ప్పని దైవోపహతంబుగా గనుట భూపాలార్హ వృత్తంబవున్."