పుట:Bhaarata arthashaastramu (1958).pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంఘపరత పౌరుషోద్దీపకంబు

ఐరోపాఖండీయు లీవిధమున గలలోనైన దలపరు. "నేను బోయినను నావారీ భూమండలమున నిలుతురుగాదె! వారు ప్రసిద్ధిగను సుఖముగను ఉండిన నంతకన్న తృప్తికరమేమి? సంఘంబు శాశ్వతంబుగాన దానికై పడుపాట్లును శాశ్వతములే. కార్యమిపుడు సమాప్తి జెందినను దానిఫలము యుగాంతమునకుంగాని నశింపదు. నేడు యుద్ధముచేయుట కుపక్రమించితి మనుకొనుడు. అపజయమైనను ఇప్పుడు చూపిన బలపరాక్రమములు పరిశ్రమచేత నుత్కృష్టములగును. ఈమాత్రముకాదు. వినినవారికిని కనినవారికిని మున్ముందు ఉత్సాహము బుట్టించు. వీరియుత్సాహము వీరితో బోవునదిగాదు. తదనంతరులంజేరి యట్లే కాలంబు కొనవఱకును వ్యాపించును. కావున పురుష కారంబు బుద్బుదప్రాయమనియుం బ్రయోజనకారి గాదనియుం జెప్పుటతప్పు. తనకుంగాకపోయినను సంఘంజెందును. సంఘం తనకన్న నెక్కుడుగాన నట్లగుటంగూర్చి చింతించుట అధమస్వభావంబు. ఇమ్మాడ్కి బరిగణించువారు గావుననే పశ్చిమ ఖండీయులు ప్రధిత స్థితింగాంచి సార్వభౌమపదవి నందియుండుట. ఇక వేయేల? "తనదు:ఖమె సర్వలోక దారిద్ర్యంబున్", "తనచావు జలప్రళయము" అని వేమన నుడివినట్లు మనదేశములో ప్రతివాడును ఏవిచారణ కారంభించినను తన సుఖదు:ఖములదప్ప నితర విషయములను గుఱించి చర్చింప బూనుటలేదు. పాశ్చాత్యులు సంఘము ప్రధానముగానెంచి సంఘపరమైన చూపుతో దత్త్వాదుల నిర్ణ యింతురు. తన పరమైన యాలోచన లాధారముగాగొని విశ్వస్వభావము నిర్ణ యింపజూచుట మనపద్ధతి. ఇయ్యది యెంతమాత్రము గణ్యమైనదిగాదు. జాత్యుపజాతి భేదములచే విభిన్నులైన యీ దేశము వారికి సంఘీభావ మనుమాట యూహకు రానిదై నందున వేఱొక సరణిని తత్త్వనిర్ధారణముచేయుట కలనైన దట్టకపోయెను. అసలు సంఘమే లేనప్పుడు సంఘలక్షణ