పుట:Bhaarata arthashaastramu (1958).pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజా వృద్ధి

ఇన్నిదేశములు చూఱగొన్నవారౌట జనసంఖ్య ఎంత హెచ్చినను అందుచే బ్రకృతము విపత్తు లుప్పతిల్లవని ఐరోపాలోని యర్థశాస్త్రజ్ఞులు పల్కుదురు. ఈన్యాయము మనమును శక్తిమంతులమైన గాని మనయెడ నమోఘంబుగాదు.

ప్రజావృద్ధికి బ్రతికూలము లేవనగా:- 1. యుద్ధములు. 2. క్షామాది మహోత్పాతములు. 3. వ్యాధులు మొదలగునవి. వీనిచే భూభారము కొంతకుగొంత దీరును. అనగా అర్థసమృద్ధిలేక ప్రజావృద్ధి మాత్రమయ్యెనేని తినుటకుంజాలక జను లనేకవిధమ్ముల గృశించి యంతము నొందుదురనియు దన్మూలమున జనసంఖ్య యొక మితి నతిక్రమింపక యుండుననియు భావములు, ఈ రీతి నుచిత సంహారంభు సర్వదా ప్రవర్తిల్లుచునేయుండు. బలహీనులైనవారు బలవంతుల పాలబడి అమెరికాలోని తామ్రవర్ణులైన ఇండియనులు, ఆఫ్రికాలోని నీగ్రోలు, ఆస్ట్రేలియాలోని పర్వతజనులట్లు క్రమమున నిర్మూలము నొందుదురు. పరస్పరోన్మూలన క్రియాలోలత్వంబు భూతములకు♦[1] మితాహారయుక్తింజేసి కలిగిన సహజగుణంబు. న్యాయ వాదంబుచే నీస్పర్థలను నిగ్రహింప జూచుట అగ్నికణంబుచే సముద్రము నార్పజూచినట్లు. మతములు మొదలగు నియమములు వీని నెదరించి విగతసత్త్వములైనవి. చూడుడు! సమస్తము నీశ్వరుడేయని వేదాంతము బోధించుచున్నను మనదేశంబునబలె నెచ్చోటను జాతిభేదములు ప్రాబల్యము గాంచలేదు. మాలయు నీశ్వరుడే; బ్రాహ్మణుడు నీశ్వరుడేయని తత్త్వము. ఆ యీశ్వరుని జూచిన నీ యీశ్వరుడు గంగాస్నాన ప్రాయశ్చిత్తము జేసికోవలయుననుట అనుష్ఠానము! దైవము మనుష్యులలో బ్రతిబింబించి యుండునట!

  1. ♦ అనగా పిశాచములుగాదు జంతువులు.