పుట:Bhaarata arthashaastramu (1958).pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తానెంత వికారముగానిది ప్రతిబింబ మింత యసహ్యమైనదో తెలియరాకున్నది. ఇక క్రైస్తవమతమును అట్లే. ఏసుక్రీస్తును నమ్మినవారందఱు నన్నదమ్ములట! అయిన నీలోకమునగాదు పరలోకమున ననుట యనుభవరచిత వ్యాఖ్యానము! న్యాయవాదములనమ్మి రక్షణోపకరణముల సేకరింపనివాడు పరమ మూఢుడనుట ముమ్మాటికి నిక్కువము.

ఐరోపా అమెరికాఖండములలో ననేకులు స్వయముగ సంతాన నిగ్రహ మొనర్చుదరు. ఫ్రాన్‌స్‌దేశములో నలువది సంవత్సరములపు డున్న జనసంఖ్యయ నేటికిని ఉన్నదిగాని పెరుగలేదు. ఇది మనుష్య కల్పితముగాని స్వభావసిద్ధముగాదు. జనాభివృద్ధిని గుఱించి ఇకముందు ఇంకను జర్చింతుము. మొత్తముమీద అమితమగు ప్రజోత్పత్తి వలన యూరోపియనులకన్న మనకు నెక్కు డిక్కట్టులు వాటిల్లు. అది యట్లుండె.

హీనవృద్ధిచేనగు నవస్థలకు, జికిత్సంబోని మార్గములు రెండు వివరింపబడియె. అవేవన్న:- కృషిని శాస్త్రవిహితరీతి ననుష్ఠించుట; రాష్ట్రవైశాల్యమును స్ఫారము గావించుట.

హీనవృద్ధి న్యాయంబు గనులు మత్స్యాశయములు వనములు వీనియందును ప్రవర్తిల్లును. గభీరతయౌకొలది లోహముల ద్రవ్వి తెచ్చుట దుర్ఘటంబు. చెట్లు నఱుకనఱుక దూర మెక్కువయై రాకపోకలు కష్టతరములౌటయు తుదకు అడవియే అంతమొందుట సంభవించును. మీనములును అట్లే. మునుపుతీరమున పుంఖానుపుంఖముగ జిక్కునవి ఇపుడు రెండుమూడుమైళ్ళు పడవలలో బోయినగాని దొరకవు. సంహారక్రియ ఇట్లేనడచిన నిక గొన్నియేడులకు యోజనమ్ములు పోవలసివచ్చునేమో! ఉత్పత్తిచేయంజేయ శ్రమ యధికముగ వృద్ధిజెందుననుట ఈ న్యాయములచే నిర్ణీతంబు. యథావృద్ధి అపురూపమైనది. కావున దీనివిచార మంతగా నక్కరలేదు.