పుట:Bhaarata arthashaastramu (1958).pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హీనవృద్ధిని అడ్డగించుట కింకొక యుపాయముం గలదు. అదేమన పరరాజ్యములను విజన ప్రదేశములను ఆక్రమించుకొనుట. దీనిని గుఱించి బలపరాక్ర మైకమత్యంబులులేని మనము చింతించుట హాస్యకారణమగును. ఉన్నది కాపాడుకొనజాలని మనము ఇతరుల నోడించి లక్ష్మీయుతుల మగుదుమనుట హాస్యమనియుం జెప్పగూడదు. హాస్యమునకు బట్టినదయ్య మనవలయు. ఐరోపాఖండీయులు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలేండు, న్యూగినీ, కనడా, అమెరికా, దక్షిణపు అమెరికాలోని రాష్ట్రములు, వీనికి జనులబంపి భూములిచ్చి జీవనోపాయములను గల్పించి వారు సుఖులౌన ట్లాచరించుటయు తమకు జనాధిక్యమువలని సంకటములు వాయుటయునను సుఖముల వడయుచున్నారు మలయ, దక్షిణాఫ్రికా, కనడా రాజ్యములలో హిందువులున్నను కూలినాలిచేసికొని క్లేశభాజనముగ నోసరిల్లుటయే గాని సుఖజీవన గౌరవంబులు వారికిలేవు. మనము మాలవారి నెట్లు బహువిధబాధలం బొరలజేతుమో తెల్లవారును అట్లే వర్ణ ద్వేషంబున వికలితధర్ములై మనజనుల పలుగోడుల గుడిపింతురు. ఆఫ్రికాలోని నల్లజనులు పడుపాటులు వర్ణింపనలవిగాదు. తెల్లవారి నంటకుండురీతి దొలగినడుచుట, రైలుబండ్లలో మొదటితరగతిలో బ్రయాణము జేయకుండుట, యజమాను లెంతక్రూరతతో వర్తించినను శాంతత నవలంబించి యూరకుండుట ఇత్యాదులు వీరికి విధింపబడిన ధర్మములు. మనుస్మృతి మనదేశములో బ్రకృతము ఇంచుమించుగ నామమాత్రావిశేషముగ నున్నది. అందలి శాసనముల నంగీకరించువారును ననుసరించువారును దఱుచులేరు. ఒకవేళ నెవడైన నారీతి నాచరించి హీనకులజుల దాసులం జేయబూనెనేని గవర్నమెంటువారీ సనాతనధర్మముల జెల్లనియ్యరు. ఇక్కడ నస్తమించిన మనువు దక్షిణాఫ్రికాలో నవతరించి యక్కడను మనవారి ప్రాణమానముల కురిగా నేర్పడినాడుగదా! ఈ దేశమున వర్ణధర్మములు అడుగంటివను ఆఫ్రికాలో ప్రబలములుగా నున్నవి.