పుట:Bhaarata arthashaastramu (1958).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

       క. పనివడి యహింసవ్రతముగ
          గొని వనముననున్న మునులకుం దొడరదె హిం
          సనము తరు మూలపల శా
          క నిపీడన మదియు హింస గాదొకొ తలపన్.

       క. ఫల మూలౌషధిశాకం
          బులు పశు మృగతతులు భక్ష్యములుగా భూతం
          బుల కజుడు సేసెనని య
          స్థలితంబుగ మ్రోయుశ్రుతులు గాదనవశమే?

అను పద్యములు నామనసునకుం దట్టినవి.

కొంద ఱహింసాపరులు చీమలకుం గుక్కలకుంబెట్టి పోషింతురు! మాంసము దినవచ్చుననువారు కాలక్రమంబు లెఱుగక ప్రాణులను వధింతురు. ఇందుచే మృగపక్షి జలచరంబులు సమసి యపురూపంబులుగాజొచ్చె. పశ్చిమఖండవాసులు నియమంబెఱిగి వధింతురు. గర్భఋతువులలో వేటాడరు. పెయ్యలని యెఱిగిరేని కాల్వరు. మత్స్యములు చిన్నవిగానున్న బట్టియు మఱల విడుతురు. కావున నచటి జంతుసమూహంబు శిధిలత నొందకున్నవి. మనదేశములో నదుల సముద్రముల వనముల విచ్చలవిడి ప్రాణులంగొనుట నానాటికి నవి యరుదుగుచున్నవి. దీనిచే నిక ముందు మిక్కిలి కీడుకలుగును. మాంసము దుర్లభమగుటయేకాదు శాకవర్గంబులను శత్రువులైన క్రిమికీటకములం దినియు తమశరీరములనుండి యెరువును విసర్జించియు జంతువులు కృషికి సహాయభూతములు. కావున దద్రక్షణం బరణ్య రక్షణం బట్లవశ్యకరణీయంబు. 'సర్ విలియం నిఖిల్‌సన్‌' గారు చేపలను సమృద్ధములనొనర్ప ఈ రాజధానిలో గృషిజేయుచున్నారు గాని జనులకు శ్రద్ధయు దెల్వియు రానిచో వారివల్ల నేమగును? వారు జపాన్ మొదలైన దేశాంతరములనుండి నానావిధములగు చేపల దెచ్చి యిచ్చటి నదులలోను చెరువులలోను విడిపించుచున్నారు.