పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రము జేయుచున్న యీయిరువురుసోదరులు, సోదరులకు సహజమగు వైరములేక, దేశకాలభేదములను గమనింపక, తమ యన్యోన్యాను రాగమును వృద్ధిపొందించు కొనుచు వచ్చిరి. బాన్ బరిపట్టణమందు జోషయాకు ముగ్గురు పిల్లలు గలిగిరి.

ఆకాలమం దింగ్లాండు దేశపు రాజు రెండవ ఛార్లెసు. ఈయన విషయాసక్తుడై రాష్ట్రమును బాడుచేసి, దాంభిక దైవజ్ఞులను జేరదీసి, నిష్కపటు లైన వారిని బారదోలుచు వచ్చెను. జోషయా ఫ్రాంక్లిను, వీరి సోదరుడు బెంజమిన్, - వీరి కుటుంబములో వీరిరువురే యని తోచుచున్నది. - పారదోలబడిన పాదరీల పక్షము నవలంబించి, దైవజ్ఞుల సమాజములకు (Conventicles) వెళ్లుచు వచ్చిరి. ఈ సమాజములు నిషేధింపబడినవి యైనందున, ఎప్పుడును స్వాస్ధ్యము లేనివియై యుండె. ఎవరి కృపాకటాక్షము వర్తకునికి శ్రేయస్కరమో యట్టివారి యాగ్రహ మీ సమాజములకు వెళ్లువారియందు బ్రసరించుచుండెను. 1685 సం. రపు ప్రాంతమున జోషయా ఫ్రాంక్లిను, తన సోదరుడు బెంజమినుకును నింగ్లాండునకును స్వస్తి జెప్పి భార్యను మువ్వురు పిల్లలను దీసికొని, తన యిరుగుపొరుగువారును, సమాజమువారును వెంబడిరాగా, బోస్టను పట్టణమునకు గాపుర మెత్తివేసెను.