పుట:Balavyakaranamu018417mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6. క్రియాపదంబులం దిత్తునకు సంధి వైకల్పికముగా నగు.

వచ్చిరి ... అప్పుడు ... వచ్చిరప్పుడు, వచ్చిరియప్పుడు.

వచ్చితిమి ... ఇప్పుడు ... వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు.


7. మధ్యమపురుష క్రియలయం దిత్తునకు సంధి యగును.


ఏలితివి ... అపుడు ... ఏలితివపుడు.

ఏలితి ... ఇపుడు ... ఏలితిపుడు.

ఏలితిరి ... ఇపుడు ... ఏలితిరిపుడు.


8. క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు.


వచ్చి ... ఇచ్చెను ... వచ్చియిచ్చెను.


9. ఇఁకాదులకుఁ దప్ప ద్రుతప్రకృతికములకు సంధి లేదు. ప్రథమేతర విభక్తివిధి నిరవకాశంబుగావున దీనిని బాధించెడిని.


వచ్చున్‌ ... ఇపుడు ... వచ్చునిపుడు

చూడన్‌ ... అయితి ... చూడనయితి.

ఉండెడిన్‌ ... అతఁడు ... ఉండెడినతఁడు.

ఇఁక - ఇఁగ - ఎట్టకేలకు - ఎట్టకేని - ఈయవి - యికాదులని యెఱుంగునది; వీనికి సంధి వైకల్పికము.