పుట:Baarishhtaru paarvatiisham.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళుతావు?' 'థర్డ్ క్లాసు సౌఖ్యంగా వుంటుందా అండి?' 'ఒక మోస్తరుగా వుంటుంది, ఫరవా లేదు వెళ్ళవచ్చును.' 'అయితే థర్డ్ క్లాసు టిక్కట్టు ఒకటి యిప్పించండి.'

సరే నని టిక్కట్టు ఇచ్చి 'మార్సేల్సులో కూడా మాకంపెనీ వుంది, అక్కడే కాకుండా ప్రతి పట్టణములో వుంటుంది. ఎక్కడే విధమైన సహాయము కావలసి వచ్చినప్పటికిన్నీ మా కంపెనీకి వెళ్ళి నట్టయితే వాళ్ళ చేతనయిన సహాయము చేస్తారు. నీవేం భయపడ నక్కర లేదు.' అని అభయ మిచ్చాడు.

సరి ఇంక మన కేం ఫరవా లేదు కదా అను కున్నాను. 'నీ దగ్గర డబ్బు చాలా వున్నట్లయితే మా చేతికి ఇవ్వాల్సింది. నీదగ్గర వుంటే పోవచ్చును. నీవు దిగగానే మార్సేల్సులో మా కంపెనీ వాళ్లు నీ సొమ్ము నీకిచ్చి వేస్తారు. నీవు ఇంకా యింటికి సొమ్మూ అదీ పంపించమని మీవాళ్ళకు వ్రాసే టట్లయితే మాకంపెనీ అడ్రెసు మీవాళ్ళకు తెలియ పర్చవలసింది. నీకు సొమ్మువచ్చినా వుత్తరాలు వచ్చినా మేము జాగ్రత్తగా వప్ప జెప్పుతాము' అన్నాడు. సరే, ఈ ఏర్పాటు చాలా బాగుందని నాదగ్గిరున్న సొమ్మంతా ఆయన కిచ్చాను. ఒక ఏభై రూపాయలు మట్టుకు నా దగ్గిర అట్టె పెట్టుకో మని మిగతా సొమ్ము కొక చెక్కూ, ఈ ఏభై రూపాయలూ నా చేతికి ఇచ్చి మార్సేల్సు వాళ్ళకంపెనీ విలాసము వున్న అచ్చు చీటీ కూడా ఒక టిచ్చాడు. రేపు మధ్యాహ్నము మూడు గంటల కిక్కడికి వచ్చినట్లయితే స్టీమరు దగ్గరికి పంపిస్తా మన్నాడు. ఆయన దగ్గిర సెలవు తీసుకొని 'ఆహా? ఎంత గొప్ప కంపెనీ ప్రతీపట్ట-