పుట:Baarishhtaru paarvatiisham.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ణములోనూ వుందంటున్నాడు. నాబోటి గాండ్లకిలా బోలెడెంత సహాయము చేస్తున్నాడు. వీళ్ళకు దీనివల్ల ఏమైనా లాభముంటుందా? లేకపోతే ఊరికేనే చేస్తున్నారా?' అని, ఆలోచిస్తూ వీధి గుమ్మము దగ్గిరికి వచ్చాను. ఇందాకటి బంట్రోతు లేచి నిలుచుని 'టిక్కెట్టు తీసుకున్నారా అండీ' అని, తీసుకున్నానని చెప్పగానే నాకు సలాము చేశాడు. వాడి పొగరుబోతుతనము కొంత అణిగిందిగదా అని సంతోషించాను.

అక్కడినుంచి బజారువైపుకు దారి అడిగి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాను. ఈ పట్టణము బజారుకూడా చాలా బాగానే వుంది, చెన్నపట్నములో కంపెనీలాంటి కంపెనీ ఒకటి కనబడితే ఇది వరకు కొన్నది అక్కరకురాలేదు కనకను, మళ్ళీ ఒక టోపీ ఒకటి కొనుక్కున్నాను. తరువాత ఇంటికి వచ్చేసరికి ఇంకోసంగతి జ్ఞాపకమువచ్చింది! దీపమొక టవసరముగదా అని. స్టీమరులో దీపము లేకపోతే? ఒకవేళ వున్నప్పటికిన్నీ వాళ్ళు తెల్లవార్లూ వుంచుతారో వుంచరో చీకట్లో పడుకోడానికి నాకు భయము. నిన్న రాత్రి స్టీమరులో దీపాలు ఎక్కేటప్పటికున్నాయిగాని నాకు తలనొప్పి వికారము తోటి ఒళ్లు తెలియకుండా పడుకుని తెల్లవారేదాకా మెళకువ రాకపోవడమువల్ల రాత్రి తెల్లవార్లూ వున్నవో లేవో జ్ఞాపకములేదు. రాత్రి స్టీమరులో లేకపోతే అప్పుడు దొరకదుగదా! ఇంతకూ మనకోదీపము, అప్పటికైనా, అడంగుకువెళ్ళిన తరువాతనైనా కావలసిందేగదా, అందుకని ఒకస్టాండూ, రెండుడజన్లు కొవ్వొత్తులూ కొనుక్కుంటే కాలక్షేప మవుతుందిగదా అని అవి కొన్నాను. తరువాత ఇంకో సందేహము తోచింది. స్టీమరులో పాలూ మజ్జిగలూ ఏమైనా దొరుకుతాయా, దొరకవా అని. ఒకవేళఏదీ దొరక్కపోతే ఎలాగనుకుని ఇక్కడొకషాపుమీద పాలడబ్బాలు