పుట:Baarishhtaru paarvatiisham.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్నాను. 'ఏం చదువుతావు?' ఈ పరీక్ష వీడికెందు కనిపించింది. అయినా దొర; ఆపైన టిక్కట్టుకూడా యిచ్చేవాడాయెను. వీడితోటి దెబ్బలాట ఎందుకని 'బారిష్టరు' అన్నాను. 'మీవాళ్ళువెళ్ళడానికి కొప్పుకున్నారా' అన్నాడు. కొంచెము సందేహించి 'ఆఁ' అన్నాను. 'లేకపోతే అసలు మీ వాళ్ళతోటి చెప్పలేదా ఏమి' టన్నాడు. నేను కొంచెము భయపడుతూ, వీడి కేమన్నా తెలిసిందా ఏమిటి మనసంగతి అనుకుంటూ, ఏమీ చెప్పడానికీ తోచక ఆలోచిస్తూ నిలబడ్డాను. 'కొంపతీసి నిజంగానే చెప్పకుండా వచ్చావా ఏమిటి! నాతోటి చెప్పవచ్చు, నీకేం భయము లేదులే. ఇలా చెప్పకుండా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు' అన్నాడు. అనేటప్పటికి కొంచెము ధైర్యము తెచ్చుకుని 'అవును. చెపితే మావాళ్ళు వెళ్ళనివ్వరని చెప్పకుండానే వచ్చాను' అన్నాను. 'అయితే కోపమువచ్చి మీవాళ్ళడబ్బు పంపించరేమో! ఆసంగతి ఆలోచించావా?' అన్నాడు. ఫరవాలేదు పంపిస్తారు అన్నాను. పంపించకపోతే చాలాచిక్కుపడవలసి వస్తుంది సుమా! ముందే ఆలోచించుకో.' 'అంతా ఆలోచించు కున్నా లెండి. తప్పకుండా పంపిస్తారనే ధైర్యము ఉంది గనుకనే బయలుదేరివచ్చాను. ఇవ్వాళ బయలుదేరే స్టీమరేదైనా ఉందా!' 'ఒకవారం దినములవరకూ లండన్ కంటా వెళ్ళే స్టీమర్లేవీ లేవు. కాని రేపు ఒక ఫ్రెంచి స్టీమరు మార్సేల్సు వరకూ వెళుతుంది. అక్కడనుంచి రైలుమీద వెళ్ళవచ్చును. అలా అయితే మీకు చౌకగానూ ఉంటుంది, త్వరగానూ వెళ్ల వచ్చును, అలా వెళ్ళడానికి మీకేమైనా అభ్యంతరము ఉందా?' 'నా కెంతమాత్ర మభ్యంతరములేదు. ఫ్రెంచి స్టీమరుకే టిక్కట్టు ఇప్పించండి.' 'ఏక్లాసులో