పుట:Baarishhtaru paarvatiisham.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందాకనుంచీ పోనీయనని మర్యాదగా ఊరుకున్నాను. నీబోటి వాళ్ళను లక్షమందిని చూశాను. ఇంక అట్టే నీవు పెంకితనము చేశావంటే నీ మీద రిపోర్టు చేయవలసి వస్తుంది, తీరా ఉద్యోగముపోతే అప్పుడు విచారిస్తే ఏమీ లాభముండదు. కాబట్టి జాగ్రత్త' అని ముందుకు నడవబొయ్యాను. వాడింక ఏమీ సమాధానము చెప్పకుండా నాచెయ్యి పట్టుకుని తిన్నగా వీధిలోకి తీసుకువెళ్ళి దిగబెట్టి 'దిక్కున్నచోట చెప్పుకో' మన్నాడు.

ఆలోచిస్తే దిక్కేమీ ఉన్నట్టు కనుపించలేదు. తీరా యీ బంట్రోతు ముండావాడితోటి దెబ్బలాట పెట్టుకుంటే అసలు వ్యహారము చెడుతుందేమోనని భయము వేసింది. ఇక్కడ వీడి స్నేహము చేసుకుంటేనే గాని లాభము లేదని తోచింది, అందుకని మళ్ళీవాడి దగ్గిరికి వెళ్ళి నెమ్మదిగా, వాడికో అర్ధరూపాయి చేతిలోపెట్టి 'నేను లండన్ వెళ్ళవలసిన మాట నిజమేను. టిక్కట్టుకోసము వచ్చాను, లేకపోతే ఇక్కడ నాకేమిపని గనుక. కావలిస్తే చూడు ఇదిగో సొమ్ము' అని జేబులో వున్న లెక్కతీసి వాడికి చూపించాను. వాడు అప్పుడు నా మాట నమ్మి జరిగిన పొరపాటుకు క్షమించమని లోపలికి దారి చూపించాడు.

తిన్నగా లోపలికి వెళ్ళాను. ఆ గదిలో గోడలనిండా పెద్ద స్టీమర్ల ఫొటోగ్రాపులూ, మ్యాపులూ ఉన్నాయి. అక్కడొక దొరగారు కూర్చున్నారు. ఆయన దగ్గిరకు వెళ్ళి 'అయ్యా నేను లండన్ వెళ్ళాలండి. స్టీమరెప్పుడు వెళుతుంది. వెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుంది. టిక్కట్టెంత అవుతుంది?' అని అడిగాను. ఆయన నన్ను ఎగాదిగాచూసి 'నిజంగా లండన్ వెళుతావా ' అన్నాడు. వెళుతున్నానన్నాను. ఎందుకుఅన్నాడు. చదువుకోడాని