పుట:Baarishhtaru paarvatiisham.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంట్రోతు కనపడి 'ఎక్కడికి ' అన్నాడు. 'లోపలి ' కన్నాను. 'ఎందుకు ' అన్నాడు. 'ఊరకనే ' అన్నాను. 'అయితే వెనక్కు తిరగండి ' అన్నాడు. 'వెనక్కి ఎందు' కన్నాను. 'ముందు పని లేనప్పుడు వెనక్కే' నన్నాడు. 'నాకు ముందు పని ఉంది' అన్నాను, 'ఏంపని' అన్నాడు. 'ఏమైతేమట్టుకు నీతోటిచెప్పాలా ' అన్నాను. 'ఆ చెప్పా' లన్నాడు. 'ఎందు' కన్నాను. అనేటప్పటికి వాడికి కోపము వచ్చి ఒకమాటు కండ్లెర్రజేసి నాకేసి చూచి 'నిన్ను లోపలికి వెళ్ళనివ్వడాని' కన్నాడు. నీవు వెళ్ళనిచ్చే దేమిటన్నాను. 'నే వెళ్ళనివ్వక్కర లేకపోతే వెళ్ళలేదేమి ' అన్నాడు. వెడతానన్నాను. వెళ్లు చూదాము అన్నాడు. 'నా యిష్టమైనప్పుడు వెళ్ళుతాను. నీ ఆజ్ఞ ఏమిటినాకు?' అన్నాను. ఒక నిముషము వాడు మాట్లాడక ఊరు కున్నాడు. నేనూ ఏదో ఆలోచిస్తున్నట్లు గోడలకేసి, మేడ మెట్లకేసి జేబుల్లో చేతులు పెట్టుకుచూస్తూ నిలబడ్డాను. కాని లోపల మట్టుకు భయము గానే వుంది. తీరా సాహసించి ముందుకి అడుగు వేస్తే వాడు రెక్కట్టుకుని వెనక్కు లాక్కు వెడతాడేమో. ఇంగ్లండు వెడుతున్నప్పు డటువంటి పరాభవము జరగడము బాగుండదు. సరే, అయినా ఏం చేస్తాడో చూద్దామని ఒక అడుగు ముందుకు వేశాను. వెనుకనుంచి తుపాకి పేల్చినట్టు 'ఆగు' అన్నాడు. వెనక్కు తిరిగిచూసి 'ఏం అలా ఉలిక్కిపడ్డావ' న్నాను. ఇంక వాడు కోపము పట్టలేక పోయినాడు. తిన్నగా నాదగ్గిరికి వచ్చి నా బుజముమీద చెయ్యివేసి 'ఇంక నీ పెంకెవేషాలన్నీ కట్టిపెట్టి మర్యాదగా బయటికి వెళ్ళ 'మన్నాడు. వాడు బుజమ్మీద చెయ్యి వేసేసరికి నాకూ కోపమువచ్చింది. బుజమ్మీద చేయి తీసి వేసి 'నీవు బంట్రోతు వన్న సంగతి మరచిపోయి నట్లున్నావు,