పుట:Baarishhtaru paarvatiisham.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను. అందుకని మీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పండి' అన్నాను. 'ఓ ఇంతేగదా. దాని కభ్యంతర మేమున్నది. ఇలా ఫలాని చోటికి వెళితే టామస్ కుక్ అండ్ సన్ అని బల్ల కట్టి ఉన్న పెద్ద కంపెనీ ఒకటి కనబడుతుంది. తిన్నగా అందులోకి వెళితే టిక్కట్టూ, మీకు కావలసిన యావద్విషయాలూ తెలుస్తయి ' అని చెప్పాడు.

'సరే బాగుంది. ఈమాత్రము తెలుస్తే ఇంక లండన్ వెళ్ళామన్నమాటేను' అని తిన్నగా ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళాను. ఆ కంపెనీచూసేసరికి లోపలికి వెళ్ళడానికి భయమువేసింది. ఇంత దేశము తిరిగినా, అంతమేడ మట్టుకు ఎక్కడా కనబడలేదు. అది గాకుండా తీరా లోపలికి వెళితే స్టీమరు ఉందంటారో లేదంటారో? ఇంకోవారము రోజులదాకా రాదంటారో? లేకపోతే అసలిక్కడినుంచి వెళ్ళడము మానేశాయి అంటారేమో? ఇక్కడి నుంచి స్టీమర్లు వెళ్ళడములేదూ అంటే చచ్చినట్టు ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకోవారము పదిరోజులు ఆలస్యమవుతుంది అంటే ఈ లోపున మావాళ్ళు నా సంగతెలాగో తెలుసుకుని ఇక్కడికి వచ్చి పట్టుకుంటారేమో? అంతే కాకుండా ఎవళ్ళనీ కనుక్కోకుండా ఉజ్జాయింపు నేదో కొద్దిగా తీసుకు వచ్చాను డబ్బు. ఇక్కడ తీరా చాలదంటే ఏమికాను నాగతి? ఇక్కడ మనకప్పు ఇచ్చేవాళ్ళెవరుంటారు? అని ఇన్నివిధాలుగా మనసుపోయి లోపలికి వెళ్ళడానికి కొంచెము సంకోచించాను.

ఏమైతేమట్టుకు ఇంతదూరము వచ్చినతరువాత ఇక్కడ సంకోచిస్తూ నిలబడితే లాభమేముందని ఏమైతే అవుతుందని లోపల దణ్ణము పెట్టుకుని కంపెనీలోకి వెళ్ళాను. అక్కడొక