నైనా అడగడానికి వాళ్లభాష తెలియదు. ఏమైనా సరే నని దైవముమీద భారంవేసి ముక్కుకు సూటిగా బయలుదేరాను. కొంతదూరము వెళ్లేసరికి పెద్దమనిషి సూటు వేసుకుని చక్కగా క్షౌరము చేసుకున్న తలకాయ మీద టోపీ పెట్టుకుని, మూడు గీతలో నాలుగు గీతలో కనపడేటట్టు గంధము పెట్టుకుని ఎదురుగుండా వస్తున్నాడు. బహుశః ఈయన కింగ్లీషు వచ్చి ఉంటుంది అనుకున్నాను. ఆయన్ని ఆపి మీ కింగ్లీషు వచ్చునా అని అడిగాను. వచ్చునన్నాడు. అయితే మీ దేవూరన్నాను. కుంభకోణము అన్నాడు. కుంభకోణమనే టప్పటికి మట్టుకు కొంచెము భయము వేసింది. మన మడిగిన దానికి సరిగ్గా జవాబు చెపుతాడో చెప్పడో అని. అయినా కుంభకోణము వాళ్లంతా మోసము చేస్తారు గనుకనా, మన్ని మోసము చేస్తే మట్టు కితని కేమివస్తుందని 'అయ్యా, మీరొక్క సహాయము చేసిపెట్టా ' లన్నాను. నేనడిగిన మాటకా పెద్దమనిషి అపార్ధము చేసుకుని అనుమానముతో నాకేసి చూసి 'నేనేమి చేయగలను వట్టి బీద వాడిని ' అని వెళ్ళి పోబోతున్నాడు. ఆయన్ని మళ్లీ ఆపి నాకాయన వల్ల ధనసహాయ మేమీ అక్కర లేదని అభయమిచ్చి 'ఒక విషయము మిమ్మల్ని అడిగి తెలుసు కోవాలని ఉంది నాకు ' అన్నాను. 'ఏమిటి ' అన్నాడు. నే చెప్పబోయే విషయముమాత్రము ఎవళ్ల దగ్గిరా మట్టుకు చెప్ప వద్దన్నాను. సరే నన్నాడు. 'నేను లండన్ వెళ్ళాలని బయలు దేరాను. ఇంటి దగ్గిర మావాళ్లకు తెలియదు. అక్కడికి వెళ్లే స్టీమ రెప్పుడు బయలు దేరుతుందో టిక్కట్లు ఎక్కడిస్తారో ఈ సంగ తేమన్నా తమకు తెలిస్తే చెపితే సంతోషిస్తాను. ఇంటి దగ్గిరే ఈ సంగతి తెలిస్తే వెళ్లనివ్వరని భయపడి వచ్చేశాను. ఇక్క డెవళ్లనూ ఎరుగను
పుట:Baarishhtaru paarvatiisham.pdf/91
Appearance