పుట:Baarishhtaru paarvatiisham.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంత అనుభవమైంది గనుక కొంచము ఇంగ్లీషు వచ్చినట్టు కనబడ్డ ముఖము గల ఒకాయన్ని పిలిచి అడగ్గా, ఇక్కడకూడా దగ్గిరలో ఒక సత్రము ఉందనీ, ఆ సత్రములోనే దుడ్డు తీసుకుని భోజనము వేస్తురనీ, తెలుసుకొని నా రధాన్ని అక్కడికి తోలమని సారధితో చెప్పాను. గదులూ, అవీ విశాలంగా ఉన్నాయి. స్నానానికీ దానికీ సౌకర్యముగా ఉంది. జనసమ్మర్ధ మట్టే లేదు. బాగుందని సంతోషించి ఒక గది తీసుకుని సామానందులో పెట్టించేసి బండికి సెల విచ్చాను. చెన్నపట్నములో వాడికి మల్లే వీడు అట్టే దెబ్బలాడలేదు. కొంచెము మర్యాదస్థుడులాగనే ఉన్నాడు. అయితే వీడు సాహెబు, అందుకనే అయి ఉంటుంది.

ఇక సావకాశంగా పెట్టె తీసి పండ్లపొడి వగైరా తీసుకొని దంత ధావనాదికముకానిచ్చి స్నానముచేసి కొంతసేపు కూర్చునే సరికి పదిగంట లైంది. భోజనము చేశాను. చెన్నపట్నము లోనే నవ్వినవాళ్లు ఇక్కడింకా నవ్వుతారని పట్టుబట్ట కట్టుకోడము మానేశాను. భోజనము చేసినంతసేపూ మనసుకు చాలా కష్టముగానే ఉంది. తర్వాత కొంచెముసేపూ విశ్రమించాను. ఇంతవరకూ బాగానే ఉంది. ఇంకముందు సంగ తేమిటో, ఏమి చేయాలో తోచలేదు. లండనుకి ఏ స్టీమరు వెడుతుందో ఎప్పుడు వెడుతుందో, ఎక్కడ టిక్కట్లు ఇస్తారో ఏమీ తెలియదు. ఎవళ్ల నడగడానికీ ఇక్కడ ఎవళ్ళనూ ఎరగనుగదా! ఒకవేళ నిన్న రాత్రి స్టీమరే తిన్నగా లండనుదాకా వెళ్ళే దేమో అడిగి తెలుసుకో నన్నా తెలుసుకున్నానుకాను. ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే ఏమి లాభమని నాసూటు వేసుకుని తలగుడ్డ చుట్టుకుని వీధిలోకి బయలు దేరాను. ఒకదారీ తెన్నూ తెలియదు. ఎవళ్ల