టప్పుడు బ్రిటిషు మ్యూజియముకు బహుమతి చెయ్యవచ్చు' నని నాకు సలహాయిచ్చి మళ్ళీ నవ్వడ మారంభించాడు. 'చిత్తము, ఈ విషయములో తమ హితోపదేశ మనవసర' మని ఆయన్ని మాడ్చాను.
ఆయన అలాగే గుడ్లు మిటకరించి నాకేసి చూస్తూ తనలో తను నవ్వుకుంటూ కూర్చున్నాడు. నా దారిని నేను పడుకుని సుఖంగా నిద్రపోయినాను. కాని లోపల మట్టుకు బెదురుగానే ఉంది, ఆ మడతమంచమో, పైనున్న మరచెంబో పట్టుకుపోతాడేమోనని. అయినా భయపడు తున్నట్లు కనిపించగూడ దనుకొని నిద్దరపోతూ, మధ్యమధ్య మెళకువ తెచ్చుకుంటూ, సామానుకేసి చూసుకుంటూ పడుకున్నాను. ఒకసారి లేచి చూసే టప్పటికి ఆయనెక్కడ దిగాడోకాని పెట్టెలో లేడు. సామానంతా జాగ్రత్తగానే ఉంది. శని విరగడయించి కదా అనుకున్నాను. మళ్ళీ ఎవళ్లూ ఆపెట్టెలో కెక్కలేదు.
నేను లేచేసరికి బాగా తెల్లవారింది. దంతధావన ప్రయత్నము చేశాను. నీళ్ళ సంగతెలాగా అనుకున్నాను. నేను కూచున్న గదిలో ఒక మూల 'లావెటరి ' అని తలుపుమీద వ్రాసి ఉంది. అదేమిటో చూద్దాము. అందులో ఏమైనా నీళ్లుంటాయేమో నని తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాను.
గది బహు పరిశుభ్రంగానే ఉంది. గోడకి చిన్న కుళాయి ఉంది. ఆ నీళ్లు కింద పడకుండా దానికింద ఒక చిన్న చక్కని కంచు బూర్లు మూకుడు ఉంది. ఆ పక్కనే మధ్య రంధ్రమున్న కుర్చీ పీట ఉన్నది. ఏ విధమైన దుర్వాసనా లేదు. ఏర్పాటంతా చాలా బాగా ఉంది. ఇంగ్లాండు నుంచి వచ్చిన తరు