పుట:Baarishhtaru paarvatiisham.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోప పడడము మొదలు పెట్టాడు. వాడి కేదో ఇంకొక అణో బేడో ఎక్కువిచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి 'వైటెవేలెయిడ్ లో ' అనే పెద్దషాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చుగదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేటప్పటికే నాకు బ్రహ్మానంద మైపోయింది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా, అందముగా, అమర్చి వాట్లముందు పెద్ద గాజులతలుపు గోడలా పెట్టేశారు. రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా, ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడ బుద్ధవుతుంది. నాగరికత అంటే దొరలదే కాని మన కేమి ఉంది?

ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగు పెట్టాను. లోపల కేవలము ఇంద్రభవనమే! ఆ సౌందర్యము వర్ణించ డానికి నా బోటి వాడికి శక్యంగాదు. ఎక్కడ చూచినా దొరలూ దొరసానులూ, అమ్మేవాళ్ళూ జాతివాళ్ళే, కొనుక్కునే వాళ్ళూ జాతివాళ్లే. నడవడానికి నేలమీద తివాసులు పరచి ఉన్నాయి, షాపు పొడూక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్లు, అమ్మే సరకులూ అన్నీ దానివెనకాల, కొనేవాళ్ళంతా దాని ఇవతల, చెప్పవద్దూ, ఆ షాపూ, ఆ సరకులూ, ఆ దొరసానులనీ చూస్తే భయంవేసింది. ఊరికే వెర్రిమొహము వేసుకుని గుడ్లు ఒప్పజెప్పి నోరు తెరుచుకుని నాలుగు మూలలూ చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలిదొర నాదగ్గరికి వచ్చి 'మీరేమన్నా కొనడానికి వచ్చారా ' అన్నాడు. 'అవును ఒక టోపీకావా 'లన్నాను. టోపీలు మేడమీద ఉంటయి, మీకేం భయము లే ' దన్నాడు.

తిన్నగా మేడమీదికి వెళ్ళాను. ఆ అంతస్థంతా ఎక్కడ