పుట:Baarishhtaru paarvatiisham.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దా మనుకున్నాను. అలాచేస్తే వాడికేమి కోపము వస్తుందో అనుకొని ఆ ప్రయత్నము మానివేసి లోపలినుంచి పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువు లివతల పడకుండా, కళ్ళు మూసుకుని జుట్టు తీసివెయ్యమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టూ వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దములో నా ముఖము నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖమూ దిగమింగి చేష్టలుడిగి అద్దములో చూసుకుంటూ ఉంటే, 'షాంపూ చేసేదా సార్ ' అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు. కాని ఇంత వరకూ వచ్చిన తరువాత ఇక ఏమిచేస్తే ఏమని గుండెరాయిచేసుకుని మొండిబ్రతుకుగనక 'కా' నిమ్మన్నాను.

నామెడచుట్టూ పెద్ద బురఖాలాంటిగుడ్డ ఒకటి కట్టినా తల పింగాళీ గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తలమీదుగా నీళ్ళు పడ్డయి. తరువాత నా నెత్తి మీద ఏదో అరఖు పోసి తల రుద్దాడు. ఆపైన మళ్ళీ తలంతా శుభ్రముగా కడిగి తుడిచివేసి కొంచము సువాసన నూనెరాచి తల దువ్వాడు. అమ్మయ్య అనుకుని లేచాను. మొదట నన్నాహ్వానించిన మనిషి ఒక రసీదు నాచేతి కిచ్చి మూడు రూపాయ లిమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడుజుట్టూ పుచ్చుకొని పైగా పావలా కాదు, అర్ధకాదు, మూడు రూపాయలిమ్మంటా డేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే అసలే లాభముండదు. మొదటనే నిర్ణయము చేసుకోవలసిం దనుకొని కుక్కిన పేను లాగ మాట్లాడకుండా మూడు రూపాయలూ వాడిచేతిలో పెట్టి బిక్క మొగము వేసుకుని ఇవతలకు వచ్చాను.

బండి దగ్గరకు వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యము చేశానని