పుట:Baarishhtaru paarvatiisham.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక అద్దము ఎదర ఉన్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెర వెనకాలనుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుగుకున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకొని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీలో వెనక్కు జార్లా పడమని నా మెడ కొక తెల్లని ఇస్త్రీగుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడము మొదలు పెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాము, అడగడమెందు కని లోపల ఒక దణ్ణము పెట్టుకుని నా ముఖము వాడి అధీనములో విడిచిపెట్టాను.

'వాడి చిత్తము వచ్చినట్లు సబ్బునురగ నా ముఖాన్ని అరిచేతి దళసరిని పామి, కత్తితీసుకువచ్చి రాతిమీద నూరకుండానే క్షౌరము చేయడ మారంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమి తెగుతుందా అని అడుగుదా మనుకుని తెగకపోతే అప్పుడే అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తోగాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్టు చెక్కేవాడు. ఇటు తిప్పీ, అటుతిప్పీ నాకు మెడనరము పట్టించకుండానూ, నా రక్తము కళ్ళ చూడకుండానూ, వాడెప్పుడూ విడిచి పెట్టేవాడుకాదు. మళ్ళీ పక్షముదాకా జ్ఞాపక ముండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమెంత సుఖంగా ఉంది! ఆ గదికి తగినట్టుంది.

గడ్డమయిన తరువాత మామూలు ప్రకారము ఇక్కడ కూడా