పుట:Baarishhtaru paarvatiisham.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాట్లలో చిన్న కుళాయిలూ, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్లముందు మంచి పరుపులు వేసిన కుర్చీలూ వున్నాయి. గుమ్మము దగ్గిర ఒకాయన కుర్చీ వేసుకుని మేజామీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువానిండా ఏవో సీసాలు చిన్న అట్ట పెట్టెలూ, రకరకాలు కనపడ్డయి. వీధి గుమ్మాని కెదురుగుండా గోడ కొక చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడకి బట్టలు తగిలించుకునే వంకె లున్నయి. నా కిదంతా చూసేసరికి మంగలి దుకాణమవునా కాదా అనే సందేహము తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను; లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపై ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణ మేమిటి చెప్మా అనుకొని, ఒకవేళ మేడమీద ఉందేమో మంగలి దుకాణ మనుకుని మళ్ళీ వాకిట్లో వున్న బల్ల కేసి చూశాను. చూస్తే మేడమీదేమీ కనుపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది మంగలి దుకాణ మవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే, నా అవస్థ గ్రహించి కాబోలును, అతనే నన్ను పలకరించాడు.

నా కింగ్లీషు రాదనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నా కరవము రాదన్నాను. 'ఓ రాదా, తెలుగువాడా మీరు. రండి ఏం కావాలా? షేవ్ కావాల్నా? ఎందు కక్కడనే నిలుస్తారు? లోన రండిమీ' అన్నాడు. దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయ పరచుకుని ఆశ్చర్య పోతూ నా కాళ్ళమట్టి అంటుకుని నేల మురికవుతుందేమోనని భయపడుతూ, లోపలికి వెళ్ళి నిలబడ్డాను. 'కూర్చోండి ' అని