పుట:Baarishhtaru paarvatiisham.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చూచినా టోపీలే. అనేక రకాలు. ఒకచోట అమ్మేవాడు మొగవాడు. ఇంకోచోట అమ్మే మనిషి ఆడది. మొగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. 'ఎలాంటి ' దన్నాడు. ఎలాంటిదని చెప్పను? చెన్నపట్నంలో అందరికీ సరి పడ్డన్ని టోపీలున్నాయి. అందులో నాకు ఫలానిది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెము పెద్దవిగానూ, అందముగానూ ఉన్నట్టు కనబడ్డయి. ఆ దొరతో చెప్పాను, అక్కడి టోపీ కావాలని. తిన్నగా నన్నాదొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి, 'ఈయనకు టోపీకావాలటచూడ' మన్నాడు. 'ఏ సైజ్ ' అన్నది. ఏం చెప్పటానికి తోచిందికాదు. టోపీకి సైజేమిటనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. 'ఎలాంటి ' దన్న దా దొరసాని. సన్నని ఖర్జూరపాకులతో అల్లిన పెద్దటోపీ ఒకటి చూపించి, అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి 'ఇది సరిపోయింది పుచ్చుకోం'డని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి యిచ్చారు. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తలవంచుకుని చక్కావచ్చాను. నా వెనకాల ఆ దొరా, దొరసానీ ఒకటే నవ్వుకోడము.

కిందికి వచ్చి, మనము స్టీమరుమీద ఉండాలి కదా, గడియారము లేకపోతే టయిము ఎలా తెలుస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన 'టెంపసు' వాచి ఒకటి కొన్నాను. స్టీమరు మీదనుంచి మళ్లీ ఎన్నాళ్ళకు దిగుతామో, పనిచేయించుకోకుండా గెడ్డము పెంచుకుంటే బాగుండదని స్టీమరుమీద మంగలివాళ్ళుండరని తోచి, రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీరేజరొకటి కొనుక్కుని బయట పడ్డాను.