1
నర్సాపురం దగ్గిర మొగలితుర్రు మా కాపుర స్థలము. మా ఇంటిపేరు వేమూరు వారు, నా పేరు పార్వతీశం. నేను టెయిలర్ హైస్కూలులో అయిదో ఫారము దాకా చదువుకున్నాను. ఒకటి రెండేళ్ళు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదనీ, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతు లేమిటో అవగాహన కావడము లేదనీ, నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధనవ్యయమూ కాలవ్యయమూ కాలయాపనా ఎందుకని నేను చదువు మానివేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉన్నది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా, ఇంటి దగ్గిర కూర్చొని, దేశ కాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని.
ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితు డొకడు వచ్చి మాటలమధ్య ఇంగ్లండు వెళ్ళి చదువుకోమని హితోపదేశము చేశాడు. అతడు వెళ్ళిపోయిన తరువాత ఇంగ్లాండు ప్రయాణమును గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలూ, కష్టసుఖాలూ, నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతనూ దేశాటనము శ్రేయస్కరమని, పైగా మన అధికారుల దేశము వెళ్ళి, వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి, గుట్టూ మట్టూ తెలుసుకొంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా