2
ఉంటుందనీ ఆలోచించి, అక్కడకు వెళ్ళి బారిష్టరు చదువు దామని నిశ్చయము చేసుకొన్నాను.
మా తండ్రి వ్యవసాయదారుడు; ఏమీ చదువుకున్న వాడు కాడు; వట్టి అనాగరికుడు; అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెపితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురము వెళ్ళి నాల్గు రోజులలో వస్తానని ఇంటి దగ్గిర చెప్పి బయలుదేరాను.
ఇంగ్లాండు ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివిన పాఠమువల్లా, తరువాత చదివిన భూగోళ శాస్త్రమువల్లా, ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును. కాని అక్కడికి తీసుకొని వెళ్ళవలసిన సాధన సామగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో, తెలుసుకుందా మంటే చెప్పడానికి ఎరిగివున్న వాళ్ళూ ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురములో ఉన్న దొరల నెవరినైనా అడుగుదామా అంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళ నడగడము మానివేసి నాసహజ సూక్ష్మబుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడనుంచి తీసుకు వెళ్ళితే ఇంకా కావలసినవి త్రోవలోనో, అక్కడకు వెళ్ళిన తరువాతనో, కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని, అనవసరముగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడ దనుకొని, సూక్ష్మములో తేల్చవలెనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను.
ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒకచివరనుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవికదా అనుకొన్నాను. అందుకని నిద్ర లేవడముతోనే కావలసిన సామాన్లు