పుట:Baarishhtaru paarvatiisham.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ణతి పొంది ఉంటే తప్ప సరియైన హాస్యాన్ని చక్కగా అర్ధం చేసుకోడం కష్టం.

ఇంక మూడో వారు- మొదట యీ కథ వినీ, తమరు చదివీ చాలా బాగుందన్న పెద్దమనుష్యులు కొందరు- నాలుగు రోజులు పోయిన తరువాత-ఆయన బొంద- ఇదో పెద్ద ఇదేమిటి-ఏ డాన్ కిక్సాట్టో చదివి కాపీ కొట్టాడు. ఈయన తెలివితేటలే మేడిసినాయి అన్నారు. ఇది సామాన్యంగా ప్రతి ఆంధ్రుడు చేసే విమర్శ-ఒక చక్కని పుస్తకం వ్రాయడంగాని, ఒక చక్కని చిత్తరువును చిత్రించడం గాని, బుద్ధి కుశలతగల ఏ పని గానీ, ఏ ఆంధ్రుడూ చెయ్యలేడని ప్రతి ఆంధ్రుడుకీ ఒక గట్టి నమ్మకం. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదేనా కనపడితే ఇది ఎక్కడో చేదెబ్బ కొట్టాడని అనుకుని మనవాళ్ళు తృప్తిపడతారు. పోనీ లెండి-ఏంచేస్తాం. టాగూరంతటి విశ్వకవికే తప్పలేదు ఈ అపవాదు; ఇంక అస్మదాదులమెంత. సరే, ఎవరు ఏమన్నా, అనాలోచిత సంకల్పంలో ప్రభవించిన పార్వతీశం అందరి ఆదరాభిమానాల చేతా విశాల విఖ్యాత యశుడు అయ్యాడు. నా కది ఆనందహేతువు. ఎందుచేతనంటే, అతని యశోదీధితులు కొన్ని ప్రత్యక్షంగానూ, కొన్ని పరోక్షంగానూ నా మీదకూడా పడి నన్ను గిలిగింతలు పెడుతూంటాయి- అప్పుడప్పుడు.