పుట:Baarishhtaru paarvatiisham.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, ఈ ఆనందంతోపాటు నాకు కొన్ని సందేహాలు కలిగి బాధించగా కొంత ఆత్మపరీక్ష చేసుకో వలసి వచ్చింది. నేను గొప్ప పుస్తకం వ్రాసి అందరనూ గొప్పగా ఆనంద పరవశులను చెయ్యవలెనని కాని, అందుకు నేను తగిన వాడనని కాని ఎప్పుడూ అనుకోలేదు. కాని, కొందరు కాదన్నా గొప్ప పుస్తకమే అయింది. అఖండ ఖ్యాతి నార్జించింది. ఆపేరు మీదనే నేను చెలామణి అవుతున్నాను. అందుచేతను నాలో లేని శక్తి ఏదో ఉన్నట్లు ప్రజలను భ్రమపెట్టి ఆ రీతిగా వారిని మోసగించడం లేదుకదా అనే సందేహం ఎప్పుడూ నన్ను బాదిస్తూ ఉంటుంది.

అది అలా ఉండగా పార్వతీశం విశిష్టత ఏమిటో, ఎందు కింత మందికి ప్రేమ పాత్రుడయ్యాడో, ఇతన్ని చూచి ఎందుకు జనం విరగబడి నవ్వుతున్నారో అనే ప్రశ్న పరంపర బయలుదేరుతూ ఉంటుంది. మనం ఏదో వ్రాశాం-వాళ్ళు నవ్వుతున్నారు; సంతోషిస్తున్నారు. ఇంకను ఈ వెర్రి సందేహాలు నాకెందుకు అని ఒక పక్క సమాధానం వచ్చినా, దానితో తృప్తి పడే స్వభావం కాదు కనుక మరి కొంచం తరచి చూచాను. దానిపైన అసలు, ఎదటి వాళ్ళను చూచి మనం ఎందుకు నవ్వుతాం-వాళ్ళలో ఏ లక్షణాలు మనల్ని నవ్విస్తాయి, అనే ఆలోచన కలిగింది. ఇది