పుట:Baarishhtaru paarvatiisham.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంట్రోతు నా సామాన నక్కడపెట్టి వాడిదారిని వాడు చక్కా పోయాడు. నేనొక్క నిమిషము సోఫామీద కూచుని విశ్రాంతి తీసుకుని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలదే కాని మనకేముందనుకున్నాను. మన దేశ మెప్పు డిటువంటి స్థితికి వస్తుందో అనుకున్నాను. తలుపు దగ్గిరే గోడని బొత్తాము నొక్కండి అని ఇంగ్లీషున వ్రాసివుంది. ఎందుకలా వ్రాశాడని ఆలోచించి, వచ్చినవాళ్ళంతా నొక్కాలేమోననుకుని నొక్కాను. ఒక నిమిషానికల్లా ఒక బంట్రోతు పరుగెత్తుకుని వచ్చి ఫ్రెంచిలో ఏదో అన్నాడు. నాకు ఊరికే ఆకలి దహించుక పోతున్నది. వీడువచ్చి ఆ భాష మాట్లాడడముతోటే నాకు ఒళ్ళు భగ్గున మండి నీవు మర్యాదగా ఇంగ్లీషు మాట్లాడితే మాట్లాడు లేకపోతే కిక్కురు మనకుండా అవతలికి నడువ మన్నాను. వాడి కింగ్లీషు కొద్దిగా తెలుసునని తోస్తుంది, మీ రెందుకు గంట కొట్టారు అన్నాడు. నేను గంట కొట్టలేదు అన్నాను. చిత్తము, గంట కొట్టినట్లు వినబడితే వచ్చానండీ! తమకే మైనా కావాలా? అన్నాడు. ఆఁ అన్నట్టు భోజనము చెయ్యాలి భోజనాల సావడి ఎక్కడ అన్నాను. అప్పుడే ఏదో జ్ఞాపకము వచ్చి నట్టుగా, వాడు నాకేసి ఒక సారిచూసి మీరు మీగదిలో భోజనము చేస్తారా! అందరితోటీ హాలులో భోజనము చేస్తారా? అన్నాడు. అందరితోటి పాటూ హాలులో భోజనము చెయ్యకుండా నాగదిలో ఎందుకు భోంచెయ్యాలి? అక్కడికే తీసుకు వెళ్ళు అన్నాను. చిత్తము, దయచేయండి అని హాలులోకి తీసుకువెళ్లి ఒక మూల కూచోపెట్టాడు. ఒక దానికంటె మరిఒకటి మరీ వింతగా వుంది. ఇదివరకు అన్ని ఊళ్లలోనూ చూసిన అన్నిటికంటే ఈ హాలు ఎక్కువ అందముగా వుంది. ఇక్కడ బల్లలూ,