పుట:Baarishhtaru paarvatiisham.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాను అన్నాను. వచ్చీ రాని ఇంగ్లీషులో నన్ను లోపలికి దయచెయ్యమన్నాడు. ఆ హోటలులోకి వచ్చినవాళ్ళు ఎవళ్ళో దొరలూ దొరసానులూ, నన్ను చూసి నవ్వడము మొదలు పెట్టారు. నాకా గది అక్కరలేదు. నా సామాను ఇవతల పడవేయమని మళ్లీ చెప్పాను గుమాస్తాతో. ఇంకవాదించి లాభము లేదనుకున్నాడు కాబోలు, నన్ను చేయిపట్టుకుని బలవంతముగా గదిలోకి తీసుకువెళ్ళి తలుపువేశాడు. వేసీ వేయడముతో గదికి గదీ హఠాత్తుగా అంతరిక్ష మార్గములోకి ఎగిరిపోయింది. నేను హడలి పోయి కెవ్వుమన్నాను. ఇంతట్లోకే గది ఆగింది. బంట్రోతు తలుపుతీసి బయటికి నడవమన్నాడు. ఇదేమీ నా కర్ధము కాలేదు. ఇంకా ఏమి వింతలు జరుగుతాయో అనుకుని ఆశ్చర్య పోతూ ఇవతలకు వచ్చాను. బంట్రోతు సామాను తీసుకుని తన తోటి రమ్మని తిన్నగా ఒక గదిలోకి తీసుకువెళ్లి ప్రవేశపెట్టాడు. అప్పటికి ప్రాణము కుదుటపడ్డది. ఇందాకటిది, మేడ శ్రమపడకుండా ఎక్కడానికి ఉపాయముగదా అని తెలుసుకున్నాను. నన్ను చూసి వాళ్లంతా ఎంత నవ్వుకున్నారో గదా అని సిగ్గు పడ్డాను.

ఈ గదికూడా హోటలుకు తగినట్టుంది. విశాలమైన పెద్ద మంచమూ, దానిపైన రెండు పరుపులూ, పైన బాగా రెండు అరచేతుల దళసరిగల పట్టుబొంతా, ఒక పక్కను సోఫా, రెండుకుర్చీలూ, ఒక మేజా, దానిపైన పెద్ద అద్దమూ, ఇంకో మేజాపైన ఒక పెద్ద పింగాణీ బూర్లెమూకుడూ, నీళ్ళసహితంగా రెండు పెద్దకూజాలూ, సబ్బూ, మల్లెపూవులాగ ఇస్త్రీ చేసిన రెండు తువాళ్లూ, ఇంక ఆ గోడలూ, అందమూ వర్ణిండానికి శక్యము కాదు. నేను కండ్లు అప్పగించి గదికేసి చూస్తూంటే