Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాట్లపైన మల్లెపువ్వులాంటి గుడ్డలూ వాటిపైన రంగురంగుల పువ్వులతోటి వున్న రకరకాల కూజాలూ, తెల్లని ఆ పళ్ళాలూ చూస్తే కన్ను చెదిరి పోతున్నది. ఏమి ఈ సౌందర్యము, ఐశ్వర్యము, అని ఆశ్చర్యపోతూ గుడ్లు ఒప్పజెప్పి చూస్తూ కూచున్నాను. హాలు నిండా అనేకమంది దొరలూ దొరసానులు భోజనానికి కూర్చున్నారు. వాళ్ల వేషాలు చూస్తేనే చాలా గొప్పవాళ్లని తెలుస్తున్నది, నాబోటి వాండ్లకు కూడాను. నా కేసి ఒక్కసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ల ధోరణిన వాళ్లున్నారు. బ్రాహ్మణ భోజన మధ్య మందు ఎదురుగా వచ్చిన పంచముణ్ని చూసినట్టుగా వాళ్ళు నాకేసి చూసినట్టు తోచింది. ఎరక్కపోయి వచ్చాముగదా ఇక్కడికి అనుకున్నాను. బంట్రోతు ఒకడు వచ్చి మాంసపుకూర ఉన్న కంచ మొకటి నా దగ్గిర పెట్టాడు. నేనది తిన నని సూచించాను. ఏం కావాలన్నాడు. నేను శాకాహారి నని చెప్పాను. అంటే ఆ కంచము తీసుకువెళ్ళి ఒక చేపను తీసుకువచ్చి పెట్టాడు. అదీ పనికి రాదంటే, రెండు కోడిగుడ్లు తీసుకువచ్చి పెట్టాడు. ఆశ్చర్యపోతూ ఇవీ సయించవని చెప్పాను. ఏదో కొత్తరకము జంతువును చూసినట్లుగా నాకేసి చూసి, నాలుగు ఉడకేసిన బంగాళా దుంపలూ, చిక్కుడు గింజలూ, మొదలైన కేవలము శాకములు తీసుకువచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు. బంట్రోతుకు కూడా లోకువయి పోయినాము గదా అని విచారించాను. భోజన మయింది. ఇంక ఒక్కసారి కుక్ వారి కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గిరనుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందా మని బయలు దేరాను. మేడ దిగడానికి ప్రొద్దుటి గది కోసము కేక వేద్దా మనుకుని, ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందికి వచ్చాను. నన్ను చూసిన వాళ్ళంతా