పుట:Baarishhtaru paarvatiisham.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7

ప్లాటుఫారము మీదికి రైలు వచ్చినట్టుగా, మార్సేల్సులో స్టీమరు సముద్రంలోకికట్టిన ఫ్లాటుఫారము దగ్గిరికి చేరింది. ప్లాటుఫారమునిండా జనము కిటకిటలాడుతున్నారు. స్టీమరుమీద వున్నవాళ్లు కింద ఉన్నవాళ్ళకీ, కింద ఉన్నవాళ్ళు స్టీమరు మీది వాళ్ళకి చేతులూపడము, జేబు రుమాళ్ళు విసరడము, ముద్దులు గిరవాటు వేయడము, వీళ్ళతాలూకు బంధువులంతా వీళ్ళని చూడడానికి వచ్చారుగదా అనుకున్నాను. స్నేహితులు గాని బంధువులుగాని లేనివాణ్ణి నే నొక్కణ్ణే. నర్సాపురమునుంచి నేనెప్పుడింటికి వచ్చినా ముందు ఉత్తరము వ్రాస్తే మా అమ్మ ఎంతపని ఉన్నా వీధిలో నిలుచుని నా రాకకు ఎదురు చూస్తూ ఉండేది. మానాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకెదురుగుండా వచ్చేవాడు. ఇవ్వాళ ఇక్కడెవళ్లూ లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖము వచ్చింది. కొత్త ప్రపంచములోకి వెళుతున్నాను కదా! అనుభవము లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనక ఆసరా ఎవళ్లూ లేకుండా ఈ దేశములో ఎలా నిగ్రహించుకో గలనా అని భయమువేసింది. ఒక్కొక్కళ్లే దిగి కిందనున్న వాళ్లను కౌగలించుకుని ఆనంద బాష్పములు కారుస్తూ ఉంటే, నాకూ కళ్ళవెంబడి నీళ్ళువచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కణ్నితప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరుమనిషి