పుట:Baarishhtaru paarvatiisham.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చక్కగా వుంది. సూర్యు డప్పుడే ఉదయించినట్లున్నాడు. తరుణ కిరణములప్పుడే తరంగములమీద నాట్యముచేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్టు మంచువిడిపోతూ, ఒడ్డునవున్న పర్వతములు మొదలైనవి కొంచెము కొంచెము కనిపిస్తున్నాయి. అన్నిటికంటె స్పష్టంగా ఒక పర్వతము మీది దేవాలయ శిఖరముమీద సువర్ణవిగ్రహము ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానముగా కనపడ్డది. అంత కంతకు దరి జేరుతున్నాము. అక్కడ హార్బరులో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్క లేదు. ప్రపంచములోవుండే స్టీమర్లు అన్నీ ఒక్కసారి ఇక్కడకు వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయము కలిగింది. నామనస్సు మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మనగతి ఏమవుతుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు పదకొండు గంటలు అయ్యేసరికి మార్సేల్సు చేరాము.


Baarishhtaru paarvatiisham.pdf