పూటుగా జనాన్ని ఎక్కించుకొని మా స్టీమరుకేసే వెళుతున్నాయి. ఈ జనమంతా మా స్టీమరులో ఎక్కే వాళ్లేనని చెప్పాడు నాతో ఉన్న మనిషి.
నిమ్మళంగా స్టీమరుదగ్గిరికి చేరాము. మొన్నటికి మల్లేనే నిచ్చన కిందికి దింపారు. ఒక్కొక్కళ్ళమే పైకి ఎక్కాము. ఒక్క పెద్దమేడ మీద నిలుచుని కిందకి చూస్తున్నట్లుగా వుంది దాని మీద నిలుచుని చూస్తూంటే. నాతో ఉన్న మనిషి నా సామాను తీసుకు వెళ్ళి లోపలెక్కడో పెట్టేశాడు. మేమంతా చాలా మందిమి అక్కడనే నిలబడి, సముద్రముకేసి తక్కిన స్టీమర్లకేసి, దరిని ఉన్న మేడలకేసీ చూస్తున్నాము. ఇంతటిలోకే గంట వినపడ్డది. కిందకు దిగేవాళ్ళంతా దిగిపొమ్మని కేక వేశారు. పైకి వచ్చిన చాలామంది, మళ్ళీ ఆ చిన్న నావలలోకి దిగి పైనున్న వాళ్లకేసి చూస్తూ చేతులూగిస్తూ వెళుతున్నారు. వాళ్లంతా తమ వాళ్లని సాగనంపడానికి వచ్చారు గదా అనుకున్నాను. మావూరునుంచి ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే మా అమ్మా నాన్నా వద్దంటున్నా ఎంతో దూరము వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడల్లా ఎవళ్లూ లేరుగదా అనుకున్నాను. దిక్కు లేకుండా నిరాధారినై పక్షివలె నూతన ప్రపంచములోకి వెళుతున్నాను గదా అనుకున్నాను. అక్కడ ఏమి చిక్కులు పడాలో కదా అనుకున్నాను. నా ఉత్తరము చూసుకుని యింటిదగ్గిర మా అమ్మా నాన్నా ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఇదంతా తలుచుకునే టప్పటికి పట్టరాని దుఃఖము వచ్చింది.
మా స్టీమరు బయలుదేరించి. చిన్న నావల్లోవాళ్లు ఇంకా స్టీమరులో వాళ్లకి మనుష్యుల ఆనవాలు తెలియక పోయినా