ఉత్తరము వ్రాస్తాను. మ||న|| మా అమ్మకు నమస్కారాలని చెప్పవలెను.
చిత్తగించవలెను.
విధేయుడు
వే. పార్వతీశము
షరా: సొమ్ముమట్టుకు తక్షణము టిల్లిగ్రాపు మనియార్డరు ద్వారా పంపించవలెను.
ఈ ఉత్తరము వ్రాయడానికి చాలా కష్టము వేసింది. మా అమ్మమాట తలుచుకునే సరికి కండ్లవెంబడి నీళ్ళు వచ్చినాయి. చెయ్యి వణకడము మొదలు పెట్టింది. కలము ముందుకు సాగింది కాదు. ఎలాగైతే నేమి, ఉత్తరము పూర్తిచేసి కవరులో పెట్టి పై చిరునామా వ్రాసి పోస్టాఫీసుకు వెళ్ళి పోస్టులో వేసివచ్చాను. ఇంటికి వచ్చి స్నానము చేసి భోజనానికి లేచాను. అన్నము ఏమీ సయించింది కాదు. ఎలాగో రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చి సామాను సర్దుకుని కాసేపు పడుకుని రెండుగంటలకు బయలుదేరి సామాను సహితంగా కుక్ వారి కంపెనీకి వెళ్ళాను.
అక్కడనుంచి వారు నాతోటి కూడా ఒక బంట్రోతునిచ్చి సముద్రపు ఒడ్డుకు పంపించారు. మా స్టీమరు సముద్రములో కొంచెము దూరములో ఉంది. మొన్న ఎక్కిన స్టీమరు కంటె కూడా చాలా గొప్పదిగా కనబడ్డది. నాతోటి ఉన్న బంట్రోతు ఒక చిన్న నావదగ్గిరికి తీసుకువెళ్ళి అందులో నన్నెక్కమని తను కూడా యెక్కాడు. దాంట్లో అది వరకే చాలామంది దొరలూ దొరసానులూ ఉన్నారు. ఇలాటివే ఇంకా రెండు మూడు నావలు