పుట:AntuVyadhulu.djvu/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూక్ష్మజీవు లెవరికంటును

73


ముచేగాని తిండిలేమిచేగాని శరీరపటుత్వము తగ్గియున్నప్పుడును చలిగాలియందును ఎండ వానలయందును తిరుగుచున్నప్పుడును సూక్ష్మజీవులకు సులభముగ లొంగిపోవును. బలముగ నున్నప్పుడు మనశరీరములో ప్రవేశించినను మనకపకారము చేయలేని సూక్ష్మజీవులే మనము బలహీనస్థితిలోనున్నప్పుడు మనలను శీఘ్రముగ లోబరుచుకొనును. క్షామాదుల యందు వేనవేలు ప్రజ లంటువ్యాధుల పాలగుటకు ఇదియే కారణము.

మనోవిచారము, భయము మొదలగు కారణములు కూడ క్షయ మొదలగు వ్యాధుల వ్యాపకములో సహాకారులగునని తెలియుచున్నది. ఇదిగాక మనశరీరమునం దీ సూక్ష్మజీవులు ప్రవేశించు స్థలమునుబట్టికూడ వాని యుపద్రవము మారుచుండును. ఇందునకే ఇతరస్థలములందలి పుండుకంటే పెదవులమీదనుండు పుండు మిక్కిలి శీఘ్రముగ వ్యాపించును.

ఇది ఇట్లుండగా నొకానొకనికి అంటువ్యాధి తగులుటకు తగిన అవకాశములన్నియు నున్నను అది వాని నంటదు. మశూచకము ఊరంతయు వ్యాపించియున్నను ఇంటిలో చాల మందికి వచ్చినను, మశూచకపు రోగులకు దినదినము ఉపచారము చేయుచున్నను అందరికిని ఈ వ్యాధి యంటుననిభయములేదు. కొందరికి తేలుకుట్టినపుడు అమితముగ బాధపెట్టుటయు, మరికొందరికి బొత్తుగ ఎక్కక పోవుటయు ఇట్టిదియే.